
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సైన్యం నుండి వస్తున్న షెల్లింగ్ దాడుల నుండి సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఇప్పటివరకు సుమారు 9,500 బంకర్లను నిర్మించామని జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటుల్ దూలూ తెలిపారు.
తాజాగా ఆయన రాజౌరీ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను పరిశీలించి,పాకిస్తాన్ శతఘ్ని దాడులకు గురైన ప్రాంతాలను స్వయంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజల భద్రత కోసం ఇంకా ఎక్కువ బంకర్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాకిస్తాన్ దళాలు సరిహద్దులో నివసించే అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని తరచూ దాడులకు పాల్పడుతున్నాయని దూలూ పేర్కొన్నారు.
ఈ దాడుల వల్ల అనేకమంది గాయపడినట్టే కాక, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
షెల్లింగ్ కారణంగా చాలా పశువులు మృతిచెందాయని, కొంతమంది ఇళ్లను కోల్పోయారని వివరించారు.
వివరాలు
ఇంకా ఎక్కువ బంకర్ల అవసరం
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంట బేకాయిదా విధంగా దాడులకు తెగబడ్డాయని చెప్పారు.
ఈ దాడుల వల్ల కొన్ని ప్రార్థనా స్థలాలు కూడా నాశనమయ్యాయని, ముఖ్యంగా కుప్వారా, ఉరి, పూంఛ్ ప్రాంతాల్లో పాక్ షెల్లింగ్ తీవ్రంగా జరిగినట్లు వివరించారు.
ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని దూలూ తెలిపారు.
పరిస్థితిని త్వరగా అంచనా వేసి, తగిన సహాయం అందించే పనిలో ఉన్నామని వెల్లడించారు.
ఇప్పటి వరకు 9,500 బంకర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇంకా ఎక్కువ బంకర్ల అవసరం ఉందని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో మరిన్ని బంకర్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రభుత్వం తరఫున నష్టపరిహారం: ఒమర్ అబ్దుల్లా
రాజౌరీలోని కొన్ని గ్రామాల్లో పేలకముందే ఉన్న బాంబులు,శతఘ్నిగుండ్లను భారత సైన్యం జాగ్రత్తగా గుర్తించి నష్టంలేకుండా నిర్వీర్యం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా టంగ్దార్ ప్రాంతంలో జరిగిన షెల్లింగ్ ప్రభావిత గ్రామాలను సందర్శించారు.
అక్కడి కమ్యూనిటీ బంకర్లను తనిఖీ చేసి,నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ప్రభుత్వ తరఫున నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
భారత్ - పాక్ సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి.
వివరాలు
మూసివేసిన విద్యాసంస్థలు, మార్కెట్లు తిరిగి ప్రారంభం
ముందుగా మూసివేసిన విద్యాసంస్థలు, మార్కెట్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి.
మంగళవారం సాయంత్రం నుండి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.
కుప్వారా, బారాముల్లా తప్పించి మిగతా ప్రాంతాల్లో మంగళవారం నుంచే విద్యాసంస్థలు సాధారణంగా కొనసాగుతున్నాయి.
కశ్మీర్ విశ్వవిద్యాలయం కూడా బుధవారం నుండి తరగతులను ప్రారంభించనుంది.