Maharashtra: పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు నేతలు హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన శివసేన నాయకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గణపత్ గైక్వాడ్, మహేష్ గైక్వాడ్ మధ్య కొంతకాలంగా భూమి వివాదం నడుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో ఇద్దరు నేతలతో పాటు వారి మద్దతుదారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. మహేశ్‌పై కాల్పులు జరిపారు.
ఏక్‌నాథ్ షిండేపై బీజేపీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు
ఈ కాల్పుల్లో మహేష్ గైక్వాడ్, షిండే మద్దతుదారు రాహుల్ పాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం ఉల్హాస్‌నగర్‌లోని మీరా ఆసుపత్రికి రాత్రి 11 గంటలకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మొత్తం నాలుగు బుల్లెట్లను కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ వార్తా ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడిన గణేష్ గైక్వాడ్.. ఘటనపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేసినట్లు తెలుస్తోది. ఏక్‌నాథ్ షిండే బీజేపీకి 'ద్రోహం' చేస్తున్నారని గైక్వాడ్ ఛానెల్‌లో ఆరోపించడం గమనార్హం.