Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ
తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా,రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ప్రకటించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసిన తర్వాత, చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) కన్యాకుమారి, రామనాథపురం,తిరునెల్వేలి,తూత్తుకుడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్
వచ్చే రెండు రోజుల్లో చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్‌ఎంసి అంచనా వేసింది. కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం పడగా, తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో వారాంతంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని మూడు జిల్లాల్లో 400 మందికి పైగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బందిని, చెన్నైలో 200 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం మోహరించారు.