West Bengal: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త విక్కీ జాదవ్(35) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. విక్కీ జాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి బయటే గన్ తో కాల్పులు జరిపారు. జగద్దల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్‌పరాలోని పురాణి తాలా ప్రాంతంలో సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారులు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. జాదవ్ తన ఇంటి బయట ఉన్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయని అనంతరం అతన్ని భాటపరా స్టేట్ జనరల్ ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
నిందితులపై కేసు నమోదు
ముగ్గురు వ్యక్తులు జాదవ్‌పై దాడి చేసి, అతనిపై అత్యంత సమీపం నుండి తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఓ TMC నాయకుడు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గత వారం, నార్త్ 24 పరగణాస్‌లో టిఎంసికి చెందిన పంచాయతీ ప్రధాన్ రూపచంద్ మోండల్ దుండగుల చేతిలో హతమయ్యాడు. కామ్‌దేవ్‌పూర్ హాత్‌లో దుండగులు అతనిపై బాంబులు విసిరారని పోలీసు అధికారులు తెలిపారు. అతన్ని కూడా మొదట సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు, ఆ తర్వాత అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించాడు.
టిఎంసి బలాన్ని తగ్గించాలనే ఇలా హత్యలు
మోండల్ మరణం తరువాత, కొంతమంది TMC మద్దతుదారులు స్థానికులతో కలిసి 34 జాతీయ రహదారిని దిగ్బంధించి, నిందితులను అరెస్టు చేయాలని కోరారు. బరాక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ కూడా ఆ ప్రాంతానికి చేరుకుని దుండగులను అరెస్టు చేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రణాళికాబద్ధమైన హత్యగా అనిపిస్తోందని, పోలీసులు నిందితులను గుర్తించాలని సింగ్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లోని రూరల్ బెల్ట్‌లో బీజేపీ, సీపీఐ(ఎం)లు "భీభత్స పాలనకు తెరలేపుతున్నాయని" TMC అధికార ప్రతినిధి జోయ్‌ప్రకాష్ మజుందార్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు టిఎంసి బలాన్ని తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో వారు తమ ప్రజాదరణ పొందిన నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.