పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో భారత నిఘా సంస్థల పత్రాలు మాత్రం హర్దీప్ సింగ్ నిజ్జర్ నేర చరిత్రకు కళ్లకు కట్టేలా చూపిస్తున్నాయి. కెనడాను అడ్డగా చేసుకొని భారత వ్యతిరేక ముఠాకు ఆయుధాల శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఫైనాన్సింగ్ సాయాన్ని కూడా నిజ్జర్ అందించినట్లు భారత నిఘా సంస్థలు రూపొందించిన పత్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా నిజ్జర్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహాయంతో ఆ దేశంలో శిక్షణ కూడా తీసుకున్నట్లు నిఘా వర్గాల రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
200లకు పైగా హత్య కేసుల్లో నిజ్జర్ నిందితుడు
పంజాబ్‌లోని జలంధర్‌లోని భర్ సింగ్ పురా గ్రామానికి చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ 1980ల నుంచి నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. చిన్నప్పటి నుంచి స్థానిక గూండాలతో నిజ్జర్‌కు సంబంధాలు ఉండేవి. భారత్‌లో 200లకు పైగా హత్య కేసుల్లో నిజ్జర్ నిందితుడిగా ఉన్నట్లు నిఘా పత్రాలు చెబుతున్నాయి. కేసులకు భయపడి 'రవి శర్మ' పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ ఆధారంగా నిజ్జర్ 1996లో కెనడాకు పారిపోయాడు. అక్కడ ట్రక్కు డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో అతనికి పాకిస్థాన్‌లో ఉన్న కేటీఎఫ్ చీఫ్ జగ్తార్ సింగ్ తారాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2012ఏప్రిల్‌లో పాకిస్థాన్ వెళ్లాడు. ఇక్కడ అతనికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆయుధ శిక్షణ ఇచ్చింది.
జగ్తార్ సింగ్ తారతో కలిసి పంజాబ్‌లో ఉగ్రవాద దాడికి ప్లాన్
పాక్ నుంచి కెనడాకు తిరిగి వచ్చిన తర్వాత, కెనడాలో డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాలో నిమగ్నమైన తన సహచరుల ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ప్రారంభించాడు. పంజాబ్‌లో ఉగ్రవాద దాడిని అమలు చేయడానికి జగ్తార్ సింగ్ తారతో కలిసి నిజ్జర్ ప్లాన్ చేశాడు. కెనడాలో మన్‌దీప్ సింగ్ ధాలివాల్, సర్బ్‌జిత్ సింగ్, అనుప్వీర్ సింగ్, దర్శన్ సింగ్ అలియాస్ ఫౌజీతో కూడిన కేటీఎఫ్ ముఠాను తయారు చేసుకున్నాడు. డిసెంబర్ 2015లో వారు బ్రిటిష్ కొలంబియాలో ఆయుధ శిక్షణ పొందారని నిఘా వర్గాల పత్రాలు చెబున్నాయి. 2014లో హర్యానాలోని సిర్సాలోని డేరా సచ్చా సౌదా హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రదాడిని నిజ్జర్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే అతను భారత్‌కు చేరుకోలేకపోయాడు.
నిజ్జర్‌కు పాక్ నుంచి ఆయుధాల సరఫరా
భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం నిజ్జర్‌కు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆయుధాలు సరఫరా చేసింది. 2014లో నిజ్జర్‌పై భారత్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే కెనడా ప్రభుత్వం నిజ్జర్‌కు ఆ దేశ పౌరసత్వం ఇచ్చింది. 2015లో జగ్తార్ సింగ్ తారను థాయ్‌లాండ్‌లో భారత్ అదుపులోకి తీసుకున్న తర్వాత, కేటీఎఫ్ బాధ్యతలను నిజ్జర్ స్వీకరించారు. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి నిజ్జర్ పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ గిల్‌కు అప్పగించాడు. 2020లో తండ్రీకొడుకుల మనోహర్ లాల్ అరోరా, జతీందర్‌బీర్ సింగ్ అరోరా జంట హత్యల బాధ్యతలను అర్ష్‌దీప్‌కి అప్పగించాడు. మనోహర్ లాల్‌ను అర్ష్‌దీప్ అతని నివాసంలో కాల్చి చంపాడు. అతని కొడుకు తప్పించుకున్నాడు.
కెనడాలో ఉండి పంజాబ్‌లో టెర్రర్ మ్యాడుల్ నిర్మాణం
2021లో భర్ సింగ్ పురా గ్రామం (నిజ్జర్ స్వస్థలం) పూజారిని హత్య చేయమని అర్ష్‌దీప్‌ని నిజ్జర్ ఆదేశించాడు. అయితే పూజారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విధంగా, కెనడాలో ఉండి పంజాబ్‌లో టెర్రర్ మ్యాడుల్‌ని నిర్మించాడని నిఘా సంస్థల పత్రాలు చెబుతున్నాయి. జూన్ 18న కెనడాలోని సర్రే, బ్రిటీష్ కొలంబియాలోని పార్కింగ్ ఏరియాలోని గురుద్వారా వెలుపల దుండగులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. అయితే నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నట్లు కెనడా ప్రధాని ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను భారత్‌తో కొన్ని వారాల క్రితమే పంచుకున్నట్లు ఆ దేశ ప్రధాని ట్రూడో చెప్పారు. అయితే కెనడా ఆరోపణలను భారత్ మాత్రం తీవ్రంగా ఖండించింది.