CM Chandrababu: రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ రంగాల్లో అదానీ భారీ పెట్టుబడులు!
అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, గనులు, పోర్టులు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని, వీటితో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ప్రకటించింది. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి సంసిద్ధత తెలిపింది. అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా బృందం రాష్ట్రానికి చేరుకుంది.
పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్‌మ్యాప్
సోమవారం సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఈ బృందం, తమ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆయనకు వివరించింది. అభివృద్ధి కోసం విస్తృత అవకాశాలు ఉన్న రంగాలు, వాటిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న దానిపై వివరాలు తెలియజేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనలను అధికారులను పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో అదానీ పోర్ట్స్ సీఈఓ ప్రణయ్ చౌదరి,అదానీ థర్మల్ బిజినెస్ సీఈఓ ఎస్.బి. ఖ్యాలియా, బీచ్ శాండ్ బిజినెస్ సీఈఓ రాజేంద్రసింగ్,అదానీ పవర్ బిజినెస్ హెడ్ రాజ్‌కుమార్ జైన్, అదానీ గ్రూప్ ఐటీ హెడ్,ఛైర్మన్ సలహాదారు సుదీప్త భట్టాచార్య,ఏపీ,తెలంగాణ రాష్ట్రాల కార్పొరేట్ వ్యవహార హెడ్ పి.అంజిరెడ్డి ఉన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ ముఖ్యమైన ప్రతిపాదనలు
ప్రతిపాదిత ప్రాజెక్టులు అమలవుతే రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని, ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ' అదానీ గ్రూప్ రాజధాని ప్రాంతంలోని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తిగా తమ సొంత ఖర్చుతో చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత ఐఆర్‌ఆర్ మార్గాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే కొన్ని మార్పులు చేస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌కు అనుగుణంగా ఈ ఐఆర్‌ఆర్‌ను రెండు దశలుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.
బీచ్ శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులు (టైటానియం):
కార్యకలాపాలు: బీచ్ శాండ్ మైనింగ్, శుద్ధి. పెట్టుబడులు: తొలి దశలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల పెట్టుబడి.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి,పరోక్షంగా 4,000-5,000 మందికి ఉద్యోగావకాశాలు. విలువ ఆధారిత ఉత్పత్తులు: మొత్తం వాల్యూ చైన్ ప్రాజెక్టుల్లో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల పెట్టుబడి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 4వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు,8,000-10,000 మందికి పరోక్ష ఉద్యోగాలు. ప్రభుత్వ ఆదాయం మరియు విదేశీ మారకద్రవ్య ఆదా: ప్రభుత్వ ఆదాయం: ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 ఏళ్ల కాలంలో రూ.10 వేల కోట్ల ఆదాయం. విదేశీ మారకద్రవ్యం ఆదా: టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించడం ద్వారా రూ.9వేల కోట్ల ఆదా.
మౌలిక సౌకర్యాలు:
ప్రాజెక్టు ప్రాంతం,చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధి కోసం ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యా కేంద్రాలు, వర్క్‌షాప్‌ల ఏర్పాట్లు. ప్రాజెక్టు ప్రాంతం, అవసరాలు: ప్రదేశం: శ్రీకాకుళం, భీమునిపట్నం. ఉత్పత్తులు: ఆర్‌ఓఎం శాండ్, డీస్లిమ్డ్ శాండ్, హెవీ మినరల్స్. భూమి అవసరం: మొత్తం 1,034 హెక్టార్లు. నీటి అవసరం: 19 మిలియన్ లీటర్లు. విద్యుత్తు అవసరం( ప్లాంట్ల వారీగా): 0.12, 0.55, 6.83, మరియు 8 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఈ ప్రతిపాదనల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి కేవలం ఆర్థిక లాభాలే కాకుండా, సామాజికాభివృద్ధికి కూడా దోహదపడతాయి.
ప్రాధాన్య రంగంగా గుర్తించాలి.. ప్రత్యేక రాయితీలివ్వాలి
బీచ్ శాండ్ ఖనిజ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించి,ప్రత్యేక రాయితీలు అందించాలి. పారిశ్రామిక రాయితీలు: 100 శాతం ఎస్‌జీఎస్టీ (SGST), వ్యాట్ (VAT) రీయింబర్స్‌మెంట్. పరిశ్రమను పెద్ద పరిశ్రమగా గుర్తించి,పదేళ్లపాటు విద్యుత్తు సుంకంపై 100% మినహాయింపు. టైటానియం డయాక్సైడ్ ప్రాజెక్టు కోసం అధిక ఇంధన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని,విద్యుత్తు రాయితీ లభించాలి. ప్రాజెక్టును పదేళ్లు విజయవంతంగా అమలు చేసిన తర్వాత భూమి కొనుగోలు ఎంపిక అవకాశం ఇవ్వాలి. స్థిర మూలధన పెట్టుబడి (FCI)రాయితీ. టర్మ్ రుణాలపై పదేళ్లపాటు వడ్డీ రాయితీ. పెట్టుబడి కాలానికి 100% స్టాంపు రుసుము మినహాయింపు. ఈ రంగంలో ఇళ్లకు ఉచిత నీటి, విద్యుత్తు సరఫరా ఏర్పాటు. దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్ సుంకం రద్దు లేదా రీయింబర్స్‌మెంట్.
భూమి మినహాయింపులు:
బీచ్ శాండ్ పరిశ్రమకు అవసరమైన భూమికి మినహాయింపులపై ప్రత్యేక విధానం అమలు చేయాలి. విజయవాడ, అమరావతిని కలుపుతూ రోప్‌వే ప్రాజెక్ట్ భవానీ ద్వీపం, రాజధాని సీడ్ యాక్సెస్‌రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్లను కలుపుతూ రోప్‌వే సదుపాయం అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ పరిస్థితులను విశ్లేషించి, అవసరమైతే మరిన్ని స్టేషన్లను జోడించనున్నారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అత్యుత్తమ రోప్‌వే డిజైన్‌ను అమలు చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) మోడల్‌లో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన ఉంది.
కృష్ణపట్నం, గంగవరం పోర్టుల విస్తరణ
కృష్ణపట్నం పోర్టు సామర్థ్యాన్ని ప్రస్తుత 78మిలియన్ టన్నుల నుంచి 330మిలియన్ టన్నులకు, అలాగే బెర్తుల సంఖ్యను 13 నుంచి 42కి పెంచాలని నిర్ణయించారు. పోర్టు విస్తరణకు మరో 2,189.86ఎకరాల భూమి అవసరం. ఇందులో 1,033ఎకరాల అటవీ భూమికి అటవీ పర్యావరణ అనుమతులు అవసరం. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మారిటైం బోర్డుకు ప్రతిపాదన పంపారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఐఐటీతో కలిసి ఈ అంశాలను పరిష్కరించాల్సి ఉంది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న దేవాదాయ భూముల వివాదం 289.69ఎకరాలపై పరిష్కారం కావాలి. గంగవరం పోర్టు సామర్థ్యాన్ని 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్ సేకరించిన భూములను అదే పేరుతో భూసమితుల్లో నమోదు చేయించాలి.
విశాఖలో 10 కోట్ల లీటర్ల డీశాలినేషన్ ప్లాంట్
గతంలో కేటాయించిన 1,800 ఎకరాల్లో పెండింగ్‌లో ఉన్న 217.57ఎకరాలు వారి ఆధీనంలోకి రావాలి. ఏపీఐఐసీ ద్వారా 5వేల ఎకరాల నుంచి 20వేల ఎకరాల భూమిని కేటాయించి పారిశ్రామిక రాయితీలను అందించాలి, తద్వారా దేశంలోనే అతి పెద్ద పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. విశాఖలో సముద్రపు నీటిని ఉత్పత్తి చేసే ఒక వినూత్న డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్లాంట్ రోజుకు 10 కోట్ల(100 మిలియన్)లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేయగలదు, దీనికి అభికొండ బీచ్ అనుకూలంగా ఉంది. ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.800కోట్ల పెట్టుబడిని చేయబడింది. ఈ ప్లాంట్ రివర్స్ ఆస్మాసిస్ విధానాన్ని ఉపయోగించి సముద్రపు నీటిని శుద్ధి చేస్తుంది,తద్వారా మంచి నాణ్యత కలిగిన నీటిని ఉత్పత్తి చేస్తుంది.
డిజిటల్ రూట్ మ్యాప్: లక్షల్లో ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు
ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీ వినియోగించబడుతుంది, దీనివల్ల పర్యావరణానికి హాని కలిగించకుండా ప్లాంట్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ ప్రాజెక్ట్ డీబీఎఫ్‌ఓటీ విధానంలో నిర్వహించబడుతుంది. డిజిటల్, పునరుత్పాదక రంగాలు కలిసి పనిచేసే సందర్భంలో, రాబోయే 5-10 సంవత్సరాలలో 17 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని అంచనా. ముఖ్యంగా, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ సినిమా నిర్మాణం, పునరుత్పాదక విభాగాలలో ఈ అవకాశాలు ఉన్నాయి.
ఎంబసీల నిర్మాణానికి భారీ అవకాశాలు
'గూగుల్' సంస్థ తన డేటా సెంటర్ల విస్తరణకు భారతదేశంలో అనుకూల ప్రాంతాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో, విశాఖపట్టణం అవసరాలకు సరిపోయే ప్రదేశంగా గుర్తించబడింది. అయితే, కాపీరైట్ చట్టాలు, పన్నుచట్టాలు, చట్టబద్ధమైన యాక్సెస్ సంబంధిత అనేక సవరణలను ఆ సంస్థ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో హైపర్ స్కేలర్లకు డేటా సెంటర్ల కోసం, వివిధ దేశాలకు డేటా ఎంబసీల నిర్మాణానికి భారీ అవకాశాలు ఉన్నాయి. హైపర్‌స్కేలర్లను ఆకర్షించడానికి గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ (పంప్డ్ హైడ్రో/సోలార్) అవసరం. సముద్ర గర్భంలో కేబుల్ కనెక్టివిటీ, టాలెంట్ బ్యాంకు కూడా అవసరం.
విద్యుత్ రంగంలో..
ప్రపంచంలో ప్రసిద్ధ ఏఐ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలన్నది మా లక్ష్యం. దీనికి అనుబంధంగా, ప్రతి సంవత్సరానికి 50,000మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్,ఏఐ సినిమా నిర్మాణ ఇన్‌స్టిట్యూట్‌తో కూడిన యూనివర్శిటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఈ విధానం కోసం అనువైన పాలసీలను ప్రభుత్వం అందించాలి.పరిశోధన,అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ విధానాలు ఉండాలి.టాప్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు స్కాలర్‌షిప్‌లు, ప్రోత్సాహకాలను ప్రకటించాలి. 1600మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు,4000మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం పెరిగే విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే,2032 నాటికి 9013 మెగావాట్లు అదనంగా అవసరం ఉంటుందని అంచనా. ఆ విద్యుత్ అవసరాన్ని భర్తీ చేయడానికి 4000 మెగావాట్ల సౌర విద్యుత్,4000మెగావాట్ల పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాము.