Adani, Jagan Case: అదానీ-జగన్ లంచాల కేసు.. సుప్రీంకోర్టు విచారణకు సిద్ధం
అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు భారత సుప్రీంకోర్టు చర్చకు వచ్చింది. విశాల్ తివారీ అనే న్యాయవాది దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో గౌతమ్ అదానీ, జగన్ మోహన్ రెడ్డిలపై లంచం ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకారం, అదానీ గ్రూప్ 2021-24 మధ్యకాలంలో సౌర విద్యుత్ ఒప్పందాలను పొందడానికి రూ. 2,029 కోట్లు లంచంగా ఇచ్చిందని ఆరోపణలు వెలువడ్డాయి. వాటిలో రూ. 1,750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యక్తులకు చెల్లించారని పేర్కొన్నారు.
విచారణ స్వీకరించాలని కోరిన విశాల్ తివారీ
2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, అదానీ గ్రూప్‌కు టెండర్ దక్కింది. అయితే అదానీ కోట్ చేసిన ధరను డిస్కమ్‌లు ఒప్పుకోలేకపోయాయి. ఈ కేసు పిటిషన్‌ను సోమవారం అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరనున్నారు. ఈ కేసులో ఇప్పటికే హిండెన్‌బర్గ్ రిపోర్టు ఆధారంగా అదానీ వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు కోసం తివారీ పిటిషన్ వేశారు. ఈ కేసు నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, న్యాయ నిపుణుల సలహాను కోరుతోంది. జడ్జిమెంట్ సానుకూలంగా ఉంటే, జగన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని కోరనున్నారు. విపక్షాలు ఈ వ్యవహారంపై ధ్వజమెత్తాయి.
జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
టీడీపీ, బీజేపీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కేసు నేపథ్యంలో సౌర విద్యుత్ ఒప్పందాలపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. ఒప్పందాలను రద్దు చేయడం ద్వారా కోర్టు వివాదాలు రావచ్చనే ఆందోళన ప్రభుత్వాన్ని వేధిస్తోంది.