
Air India Express: ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై గమ్యంగా ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన చోటుచేసుకుంది. ముందుగానే సమస్యను గుర్తించిన అధికారులు అప్రమత్తమై విమానాన్ని టేకాఫ్ చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విమానం దిల్లీ నుంచి ముంబైకి దాదాపు 160 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో, పైలట్ ఉండే కాక్‌పిట్‌లో వేగ పరిమితులను చూపించే స్క్రీన్‌లో సమస్య కనిపించిందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇచ్చిన అధికారులు వెంటనే టేకాఫ్ ఆపివేశారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి దింపి, వారి గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
వివరాలు
కాలికట్ నుంచి దోహా వెళ్ళాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం
ఈ ఘటనపై స్పందించిన విమానాశ్రయ అధికార ప్రతినిధి, ప్రయాణికుల భద్రతకే తమకు ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా, ఇటీవల కేరళలోని కాలికట్ నుంచి దోహా వెళ్ళాల్సిన మరో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా సాంకేతిక లోపం సంభవించిన సంగతి తెలిసిందే. బుధవారం 188 మంది ప్రయాణికులు,సిబ్బందితో బయలుదేరిన ఆ విమానంలో క్యాబిన్ ఏసీ వ్యవస్థలో లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు మళ్లించి భద్రంగా ల్యాండ్ చేశారు.