ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతీయ సమాజం భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు. ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించిన నివేదికలను తాను చదివానని, ఈ విషయాన్ని ప్రధాని అల్బనీస్‌కు తెలియజేశానని మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం భద్రత, శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అల్బనీస్ తనకు హామీ ఇచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. హైదరాబాద్ హౌస్‌లో ఇరువురు నాయకుల చర్చల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
కీలక అంశాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య కీలక ఒప్పందాలు
భారతదేశం-ఆస్ట్రేలియా క్రీడలు, ఆడియో విజువల్ సహ ఉత్పత్తికి సంబంధించి కీలక ఒప్పందాలను చేసుకున్నాయి. అలాగే సోలార్ టాస్క్‌ఫోర్స్‌కు సంబంధించిన నిబంధనలను మార్చుకున్నాయి. భారత్- ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అందులో భద్రతా సహకారాన్ని ముఖ్యమైన అంశమన్నారు ప్రధాని మోదీ. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతపై చర్చించుకున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక ఒప్పందంపై తమ బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని వీలైనంత పూర్తిచేయాలని ఇద్దరం అంగీకారానికి వచ్చినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వివరించారు.