Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య "ముడా స్కామ్" విషయంలో ఇప్పటికే పెద్ద తలనొప్పిగా మారిన సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. బెంగళూరు సమీపంలోని ఓ ఏరోస్పేస్ పార్క్‌లో ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు 5 ఎకరాల భూమి కేటాయించడంపై పెద్ద దుమారం చెలరేగుతోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే ఛైర్మన్‌గా ఉన్న ఈ ట్రస్టుకు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు భూ కేటాయింపును అప్రజాస్వామిక చర్యగా అభివర్ణిస్తూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ ఖర్గేను ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
ఈ కేటాయింపు అధికార దుర్వినియోగానికి నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వ బంధుప్రీతి ధోరణికి మరో ఉదాహరణగా నిలుస్తుందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వివాదాస్పద భూ కేటాయింపు హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేటాయించిన 45.94 ఎకరాల భూమిలో భాగమన్నారు. ఇది ఎస్సీ కోటా కింద ఖర్గే కుటుంబ ట్రస్టుకు కేటాయించిందని మాల్వీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పరిణామం కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఖండించిన మంత్రి ఎంబీ పాటిల్
అయితే, కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఈ ఆరోపణలను ఖండించారు. రాహుల్ ఖర్గే అర్హుడైన దరఖాస్తుదారుడని, కేటాయింపు నియమాల ప్రకారం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, జనరల్ కేటగిరీ కింద మొత్తం చెల్లించారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త దినేష్ కలహళ్లి కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ర గహ్లాట్‌ను ఆశ్రయించి, కేటాయింపు వ్యవహారంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, ప్రాసిక్యూషన్ అనుమతి కోరారు. ప్రస్తుతం అధికార పార్టీకి ఇది పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.