
Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
సాయంత్రం 4.30 గంటలకు అక్కడికి చేరుకున్న చంద్రబాబు, ప్రధానితో సుమారు 1.15 గంటలపాటు విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు 'అమరావతి పునఃప్రారంభం-2025' పేరిట ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, భవిష్యత్తు అవసరాలను తీర్చగల సమగ్ర నగరంగా అమరావతిని అభివృద్ధి చేయనున్న విధానాలను వివరించారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే అక్షయపాత్రగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
Details
అమరావతిలో పచ్చదనం విస్తరింపజేయాలి
2015లో ప్రారంభమైన రాజధాని నిర్మాణం, తర్వాతి పరిణామాల వల్ల ఎలా ఆగిపోయిందో వివరించారు. ఇప్పుడు కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతతో అమరావతి అభివృద్ధిని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
పర్యావరణం, పౌరజీవితం మధ్య సమతుల్యతను ఉద్దేశ్యంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించినట్టు తెలిపారు.
ప్రధాని మోదీ కూడా తన ఆలోచనలు పంచుకుంటూ, అమరావతిలో పచ్చదనం విస్తరింపజేయడానికి జపాన్‌లో అనుసరిస్తున్న మియావాకి విధానాన్ని సూచించారు.
ఈ విధానం వేగంగా పచ్చదనం పెంచే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. దీనిని ఆచరణలో పెడతామని సీఎం హామీ ఇచ్చారు.
చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి స్థితి, రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Details
పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక చర్చ
రాష్ట్రానికి అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీకి, ఎస్సీ వర్గీకరణ అమలుకు కేంద్రం అందజేస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు.
ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు.
Details
రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రికి ఆహ్వానం
గత సమావేశాల్లో ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి విగ్రహం బహూకరించడం, శాలువా కప్పడం వంటి సంప్రదాయాలు పాటించిన చంద్రబాబు, ఈసారి పహల్గాం ఘటన నేపథ్యంలో అవేవీ చేయలేదు.
రాయలసీమ అభివృద్ధి అంశంపై కూడా ముఖ్యమంత్రి ప్రధానితో చర్చించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లు, డ్రోన్ సిటీ అభివృద్ధి ప్రణాళికలు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులపై కేంద్రం మద్దతు కోరారు. అలాగే రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి రావాలని ప్రధాని మోదీకి ఆహ్వానం తెలిపారు.
ఈ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ, ''అమరావతి పునఃప్రారంభం కాబోతోంది. ప్రజారాజధాని నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రిని ఆహ్వానించానంటూ తెలిపారు.