అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు
అమరావతి భూముల కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తె నివాసంలో ఆంధ్రప్రదేశ్ నేరపరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా పనిచేశారు. ఆయన నారాయణ గ్రూపు విద్యా సంస్థల వ్యవస్థాపకుడు.
ఎస్‌ఎస్‌సీ పరీక్ష పేపర్ లీకేజీలోనూ నారాణయపై అభియోగాలు
అమరావతి భూముల కేసుతో పాటు నారాయణ పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అమరావతి భూముల్లో అవకతవకలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, ఎస్‌ఎస్‌సీ పరీక్ష పేపర్ లీకేజీ సంబంధించి ఆయన కేసులు నమోదయ్యాయి. అమరావతిలో వందల ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో జనవరిలోనూ హైదరాబాద్‌లోని ఆయన కుమార్తె సంస్థపై ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది.