Andhra Pradesh: ఏపీలో మహిళలకు మరో పథకం అమలుకు సిద్ధం.. దీపావళి మరుసటి రోజు నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, మరికొన్ని పథకాలను కూడా త్వరలో అమలు చేయనుంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. వారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.
దీపావళి తర్వాతి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ పథకం
ఈ క్రమంలో, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల గురించి మాట్లాడుతూ.. దీపావళి తర్వాతి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఫ్రీ బస్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తామని ప్రచారం జరిగింది, తరువాత దసరా సందర్భంగా కూడా చర్చలు జరిగాయి. దీపావళికి ఈ హామీ నెరవేర్చే అవకాశాల గురించి ఊహాగానాలు వినిపించాయి. కానీ, చంద్రబాబు మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు. అయితే, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పథకం అమలుపై అధ్యయనం జరుగుతోందని, పక్కాగా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ్రీ బస్సు జర్నీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు, విమర్శలకు తావు లేకుండా పక్కాగా అమలు
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్న రాష్ట్రాలను పర్యటించారు. అక్కడ పథకం అమలవుతున్న తీరు, మార్గదర్శకాలు మీద అధ్యయనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించబడింది, ఈ అంశంపై ఒకటి, రెండుసార్లు చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలుకు సంబంధించిన విమర్శలు రావడంతో, ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఫ్రీ బస్సు జర్నీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు, విమర్శలకు తావు లేకుండా పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి దీపావళికి ఈ ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తారా, లేదా మరికొద్దిరోజులు ఆగుతారా అన్నది చూడాలి.