LOADING...
Ayushman Bharath: ఆంధ్రప్రదేశ్‌కు ఆయుష్మాన్‌ భారత్‌లో కేంద్ర గుర్తింపు.. డెన్మార్క్‌లో శిక్షణకు వీరపాండియన్‌ ఎంపిక
డెన్మార్క్‌లో శిక్షణకు వీరపాండియన్‌ ఎంపిక

Ayushman Bharath: ఆంధ్రప్రదేశ్‌కు ఆయుష్మాన్‌ భారత్‌లో కేంద్ర గుర్తింపు.. డెన్మార్క్‌లో శిక్షణకు వీరపాండియన్‌ ఎంపిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ABDM) అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ముందంజలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రగతిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, డిజిటలైజేషన్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతినిధిని ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి పంపాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 1 నుండి 31 వరకు డెన్మార్క్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో డానిడా ఫెలోషిప్‌ కార్యక్రమం కింద డిజిటలైజేషన్‌కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ నిర్వహణ జరుగనుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, అస్సాం,జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాల ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ డైరెక్టర్లు ఎంపిక చేయబడ్డారు. వీరిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్న వీరపాండియన్‌ను ఎంపిక చేసింది.

వివరాలు 

4.66 కోట్ల మందిని ఆయుష్మాన్‌ భారత్‌ కింద నమోదు

కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రజారోగ్య సంరక్షణలో డిజిటలైజేషన్‌, సమాచారం సేకరణ, వినియోగాన్ని కీలకంగా గుర్తించి ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.20 కోట్ల ప్రోత్సాహక నిధులు కేటాయించబడగా, డిజిటలైజేషన్‌ కార్యాలయానికి ప్రత్యేకంగా రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 4.66 కోట్ల మందిని ఆయుష్మాన్‌ భారత్‌ కింద నమోదు చేసి దేశంలో మొదటి స్థానాన్ని సాధించింది. అంతే కాకుండా 6.92 కోట్ల ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డులను నమోదుచేసి రెండో స్థానంలో నిలిచింది.

వివరాలు 

 స్కాన్‌ అండ్‌ షేర్‌ విధానంలో మూడో స్థానం 

అలాగే, 21,936 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు హెచ్‌ఎఫ్‌ఆర్‌ (Health Facility Registry) నమోదు ప్రక్రియలో ఐదో స్థానాన్ని పొందింది. అదనంగా, 2.07 కోట్ల మంది రోగులను స్కాన్‌ అండ్‌ షేర్‌ (Scan and Share) విధానంలో నమోదు చేసి, పెద్ద ఎత్తున సమయం ఆదా చేయడంలో మూడో స్థానాన్ని సంపాదించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఈ వివరాలను మంగళవారం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.