AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది. ఆగస్టు 31 నుండి కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల వల్ల రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితులయ్యారని నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో 31 మంది మరణించగా, ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో ఎన్టీఆర్ జిల్లా అత్యధికంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగినందున, తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు రూ.6,880 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. నివేదికలో వాతావరణ మార్పులు, ప్రభావం, కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీ డిజైన్ పునఃపరిశీలన, కరకట్టలను బలోపేతం చేయాలని కూడా ఆ నివేదికలో ప్రస్తావించారు.
ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట కట్టాలి
ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట నిర్మించాలని, విజయవాడలో కొన్ని ప్రాంతాలు ఆకస్మిక వరదలతో ముంపుకు గురవుతున్నాయని కూడా నివేదికలో పేర్కొంది. బుడమేరు డ్రెయిన్‌తో పాటు డైవర్షన్ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఎన్టీఆర్ జిల్లాలో 2.32 లక్షల కుటుంబాలు, 7.04 లక్షలమంది వరద ప్రభావం ఎదుర్కొన్నారు. అంతే కాకుండా, 2.37 లక్షల మంది రైతులకు చెందిన 5.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని నివేదిక తేల్చింది. వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేయగా, రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.341.30 కోట్ల పంపిణీ అవసరమని తెలిపింది. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మరణించగా, 226 పడవలు పాక్షికంగా, 217 పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు.
త్వరలో ఆపరేషన్ బుడమేరు
రోడ్లపై వరద నీరు 238 చోట్ల పారగా, 114 చోట్ల చెరువులు, 79 చోట్ల గండ్లు పడ్డాయని నివేదికలో పేర్కొన్నారు. 558 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయ్, 6,382 వీధి దీపాలు పాడైపోయాయి, 195 కి.మీ. తాగునీటి పైపులైన్లకు నష్టం ఏర్పడింది. విజయవాడ వరద ప్రాంతాల్లో 1200 వాహనాలతో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటివరకు 80 సచివాలయాలలో రేషన్ పంపిణీ అయిందని, 7,100 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కూరగాయల పంపిణీని కొనసాగిస్తామని, సహాయక చర్యల్లో ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తోందని చెప్పారు. ఆపరేషన్ బుడమేరు త్వరలో ప్రారంభిస్తామని, ల్యాండ్ గ్రాబర్స్, పోలిటికల్ సపోర్టుతో అక్రమాలు చేసే వారికి చట్టం కఠినంగా అమలుచేయబడుతుందని ప్రకటించారు.