
Andhra News: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఇప్పటికే వినతుల స్వీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజల అవసరాలు,పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి.. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే ఈ నిర్ణయానికి ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకోవడం వల్ల అనేక చోట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, కొత్త కూటమి ప్రభుత్వం ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని నిర్ణయించింది. అందుకని రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు, ఇతర సర్దుబాట్లపై అధ్యయనం చేయడానికి ఏడుగురు మంత్రులతో ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించింది. అలాగే జిల్లా కలెక్టర్‌లు ప్రజల నుండి అర్జీలను కూడా తీసుకుంటున్నారు.
వివరాలు
31 డిసెంబరులోగా అమల్లోకి రావాల్సిందే
వీటన్నింటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం, కొన్ని ప్రాంతాల్లో హద్దులు మార్చడం జరుగవచ్చు. జనగణన నేపథ్యంలో, 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు. అందువల్ల అన్ని మార్పులు 2025 డిసెంబర్ 31 నాటికి పూర్తిచేసి, అమల్లోకి తీసుకురావాల్సిన నిబంధన ఉంది.
వివరాలు
మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు
ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి ఐదు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటునకు అవకాశం పరిశీలించవచ్చు. అలాగే, బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే ప్రజలకు సౌకర్యంగా ఉండొచ్చు. ఈ మార్పుతో ప్రకాశం జిల్లా మొత్తం ఐదు నియోజకవర్గాలతో సమతూకంగా మారే అవకాశం ఉంది.
వివరాలు
అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా
అమరావతి పరిధిలోని కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటుపై ప్రతిపాదనలు పరిశీలించవచ్చు. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలను గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోకి వస్తాయి. అదనంగా, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను కూడా భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంచడం ద్వారా కొత్తగా ఐదు నియోజకవర్గాలతో అర్బన్ జిల్లా ఏర్పాటవ్వొచ్చు. గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి ఐదు నియోజకవర్గాల కలయిక కూడా చర్చలో ఉంది.
వివరాలు
అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపవచ్చు. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు విజయవాడ నగర పరిధిలో ఉన్నాయి. దీనివల్ల ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలే ఉండే అవకాశం ఉంది.
వివరాలు
రంపచోడవరం కేంద్రంగా
ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రం అయిన పాడేరుకు 187 కి.మీ పైగా ప్రయాణించాల్సి వస్తోంది. కలెక్టర్ ఒకరోజు రంపచోడవరం ప్రాంతంలో గ్రీవెన్స్ నిర్వహిస్తుంటే, మరొకరోజు పాడేరులో నిర్వహిస్తున్నారు. ఇది పరిపాలనాపరంగా ఇబ్బందిగా ఉంది. అందుకనే రంపచోడవరం డివిజన్‌తో పాటు చింతూరు డివిజన్‌లోని నాలుగు విలీన మండలాలను కలిపి ప్రత్యేకంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే ప్రజలకు పరిపాలనా సౌకర్యం కలుగుతుంది.
వివరాలు
ప్రజాప్రతినిధులు, నేతల నుంచి మరికొన్ని ప్రతిపాదనలు
శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో చేర్చాలి. మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో చేర్చాలి. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోకి చేర్చాలి. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోకి చేర్చాలి. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలి.