Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి వరద బాధితులకు ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కిట్లలో నిత్యావసర వస్తువులు, రాయితీ కూరగాయలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి పాలు, మంచినీరు, బిస్కట్లు అందించడమే కాకుండా, 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, చక్కెరను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా అందిస్తున్నారు. కూరగాయలను మొబైల్ మార్కెట్ల ద్వారా రూ.2, రూ.5, రూ.10 రేట్లతో విక్రయించనున్నారు, అలాగే ఆకుకూరలు రూ.2 ధర వద్ద అందించనున్నారు.
అగ్నిమాపక యంత్రాల సాయంతో ఇళ్లు శుభ్రం
ముఖ్యమంత్రి చంద్రబాబు వరద వల్ల నష్టపోయిన ఇళ్లను, షాపులను ఆదుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ప్రత్యేక ప్యాకేజీలపై కూడా ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వరదల వల్ల పాడైన వస్తువులు,గృహోపకరణాలు,నిత్యావసర వస్తువులు,దుస్తులు పాడైపోయాయి, తలుపులు,వార్డ్‌రోబ్స్ సహా అన్నీ మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో ఇళ్లు, రహదారులను శుభ్రం చేస్తున్నామని, ఒక్కింటి నుంచి బురదను తీసేయడానికి సుమారు 20 నిమిషాలు పట్టుతోందని చెప్పారు. రోజుకు 250-300 ఇళ్లు శుభ్రం చేయవచ్చని 50 అగ్నిమాపక వాహనాలు విజయవాడకు చేరుకున్నాయి, మరిన్ని వాహనాలు కూడా చేరనున్నాయి. ఉద్యాన శాఖ అధికారులకు భారీగా కూరగాయలను సేకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 62 వైద్య శిబిరాల ఏర్పాటు
అలాగే కూరగాయలు లేదా పాల ధరలను పెంచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వాటిపై కేసులు నమోదు చేసి విజిలెన్స్ అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామని అన్నారు. సాయం అందించాలనుకునే దాతలు నాణ్యమైన ఆహార పదార్థాలు లేదా పప్పుధాన్యాలు అందించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలు మాత్రమే వరద బాధితుల కోసం వినియోగిస్తున్నాయని, వ్యక్తిగతంగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు కేంద్రానికి ఆహ్వానం
182 ట్యాంకర్ల ద్వారా విజయవాడలో తాగునీరు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని, ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఆహ్వానించామని చెప్పారు. ఈ అంశాలపై కేంద్రం ప్రత్యేక బృందం త్వరలో రాష్ట్రంలోకి రానుందని, వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ వంటి అంశాలపై కూడా టీమ్ పరిశీలన జరుపుతుందని తెలిపారు.