
Andhra Pradesh: రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీల అభివృద్ధి.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు.. 35 వేల మందికి ఉపాధి లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో అంతరిక్ష రంగానికి అనుకూలంగా అవసరమైన సాంకేతికత,సేవలు,మౌలిక వసతుల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది. 2025 నుండి 2030 మధ్య అమలులో ఉండేలా రూపొందించిన 'ఏపీ స్పేస్ పాలసీ'కు అధికారిక ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ప్రధానంగా వచ్చే పదేళ్లలో రాష్ట్రానికి రూ.25,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చేందుకు దోహదపడాలని,అలాగే ప్రత్యక్షంగా,పరోక్షంగా కలిపి 35,000 మందికి ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా, స్టార్టప్‌లు, పెద్ద పరిశ్రమలు, విద్యా సంస్థలు, దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న సంస్థల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలన్నదే ముఖ్య లక్ష్యంగా పేర్కొంది. అంతరిక్ష రంగంలో పనిచేసే సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించింది.
వివరాలు
కేంద్రంతో సమన్వయం కోసం ప్రత్యేక వాహక సంస్థ
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, స్టార్టప్‌ల నిధులు,పెట్టుబడుల కోసం పనిచేయడం, అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వాహక సంస్థ (Special Purpose Vehicle - SPV) ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి 'ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్' అనే పేరు నిర్ణయించింది. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ప్రతిపాదించిన స్పేస్ సిటీల్లో భూముల కేటాయింపు తదితర పనుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగాన్ని నడిపించే కేంద్ర సంస్థలు
దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగాన్ని పరిశోధన, నియంత్రణ, వాణిజ్యపరమైన దృష్టితో నిర్వహించేది ప్రధానంగా మూడు కేంద్ర సంస్థలు. అవే: ఇస్రో (ISRO): ఉపగ్రహ అభివృద్ధి, లాంచ్ వెహికల్ టెక్నాలజీ, స్పేస్ ఆధారిత అప్లికేషన్లను నడిపిస్తుంది. ఎన్‌ఎస్‌ఐఎల్ (NSIL): వాణిజ్య పరంగా అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణ. ఇన్-స్పేస్ (IN-SPACe): ప్రైవేట్ సంస్థల కోసం నియంత్రణ, ప్రమోషన్ పనులను చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో రూపొందించిన పాలసీ, ఈ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా ఎస్‌పీవీ వ్యవస్థ పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
వివరాలు
రెండు స్పేస్ సిటీల అభివృద్ధి కార్యక్రమాలు
హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుసంధానంగా, శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక స్పేస్ సిటీ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. బెంగళూరుకు సమీపంగా ఉండటంతో, ఈ ప్రాంతం పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలమని ప్రభుత్వం అభిప్రాయపడింది. శ్రీసత్యసాయి జిల్లా స్పేస్ సిటీ: లేపాక్షి ప్రాంతంలో అభివృద్ధి చేసే ఈ కేంద్రం డెవలప్‌మెంట్ సెక్టార్ పెట్టుబడులకు అనువుగా ఉంటుంది. తిరుపతి జిల్లా స్పేస్ సిటీ: రౌతు సురమల ప్రాంతంలో ఏర్పాటుచేయనుంది. తయారీ, ఇంటిగ్రేషన్ మరియు లాంచ్ సపోర్ట్ సర్వీసుల కోసం అవసరమైన పెట్టుబడులను ఇక్కడకు ఆహ్వానిస్తారు.
వివరాలు
రాష్ట్రంలో ఉన్న అనేక అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పారిశ్రామిక శక్తి, సంస్థాగత నిర్మాణాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు కలగలిపి అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూల వాతావరణం కల్పిస్తాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఇస్రో కేంద్రం ఉండటం వల్ల జాతీయ అంతరిక్ష మిషన్లకు, ప్రైవేటు వాణిజ్య అంతరిక్ష సంస్థలకు అవసరమైన సేవలందించే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం మూడో లాంచింగ్ ప్యాడ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించడం వల్ల రాష్ట్రానికి అదనపు అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ఈ అన్ని అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు, ప్రణాళికాబద్ధంగా పాలసీ రూపొందించామని వివరించింది.