
Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,ధ్రోణి.. నేడు, రేపు కోస్తా జిల్లాలలో వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పిడుగులు సహా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మిగిలిన ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వారు తెలియజేశారు. బుధ, గురువారాల్లో, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
వివరాలు
మత్స్యకారులకు వేటకు వెళ్ళకండి: ప్రఖర్ జైన్
గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అందుకే, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రత్యేకంగా హెచ్చరించారు. మంగళవారం గుంటూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా నల్లపాడులో సాయంత్రం 5 గంటల వరకు గరిష్టంగా 71.5 మిల్లీమీటర్లు, కాకుమానులో 52 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో 48.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యాయి.