Page Loader
AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌.. 'సూపర్‌ సిక్స్‌'కు ఊతం! 
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌.. 'సూపర్‌ సిక్స్‌'కు ఊతం!

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌.. 'సూపర్‌ సిక్స్‌'కు ఊతం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర పునర్‌ నిర్మాణం, పేదల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ రూపొందించబడింది. సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు, అలాగే శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను అనేక మార్లు అమోదింపజేసి నిధులు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ఏర్పడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పణకు సమయాన్ని పొందింది.

వివరాలు 

పోలవరం సహా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.6,000 కోట్లు

ఈసారి పునర్నిర్మాణ ప్రణాళికలో సూపర్‌ సిక్స్‌ అని పిలుస్తున్న ఆరు ప్రధాన రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ బడ్జెట్‌ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణ రంగం, రాజధాని అభివృద్ధి, విద్య, వైద్యం వంటి రంగాలకు అధిక నిధులు కేటాయించనున్నారు. పోలవరం సహా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.6,000 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. కేంద్ర పథకాల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులను రాబట్టేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం రూ.18వేల కోట్ల వరకు నిధులు సాధించేందుకు కేంద్రం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వివరాలు 

ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌గా రూ.2,86,389.72కోట్లు 

2024-25 ఆర్థిక సంవత్సరానికి జగన్ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌గా రూ.2,86,389.72కోట్లను ప్రతిపాదించింది. ఇందులో జులై వరకు ఉన్న తొలి నాలుగు నెలలకు రూ.1,09,052.34కోట్లకు ఆమోదం పొందింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ వరకు మరో రూ.1,29,972.97కోట్లకు కూటమి ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. మొత్తం మీద నవంబర్ వరకు 8 నెలల కాలానికి రూ.2,39,025.31కోట్లకు ఆమోదం పొందారు.అధికారిక లెక్కల ప్రకారం,మొదటి ఆరు నెలల్లోనే రూ.1,27,637.19కోట్లు ఖర్చు చేశారు.

వివరాలు 

ఐదు నెలల అంచనాలు కలిపి కొత్త బడ్జెట్ 

ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌లో రెవెన్యూ రాబడి రూ.2.05 లక్షల కోట్లుగా అంచనా వేసినా,తొలి ఆరు నెలల్లో వచ్చినది కేవలం రూ.68,463 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు పూర్తయ్యాయి,కాబట్టి ఆ ఏడు నెలల ఖర్చు వాస్తవాలు, మిగిలిన ఐదు నెలల అంచనాలు కలిపి కొత్త బడ్జెట్ రూపొందించాల్సిన అవసరం ఉంది.