Page Loader
Accidental Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు 
ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Accidental Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అతివేగం మోజుతో వాహనాలను నడిపే వారికీ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారికీ భారత సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. తమ తప్పు కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. డ్రైవింగ్ సమయంలో విన్యాసాలు చేస్తూ లేదా అత్యధిక వేగంతో వాహనం నడిపి ప్రమాదానికి గురైనవారు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించినా బీమా మొత్తాన్ని పొందలేరని తెలిపింది. ఈ తీర్పు బీమా క్లెయిమ్ కోరిన ఓ కుటుంబ పిటిషన్‌ను తిరస్కరించడంతో వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

అతివేగంగా వాహనం నడుపుతూ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన 

2014 జూన్ 18న కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని మైలనహళ్లి గ్రామం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఎస్ రవీష్ అనే వ్యక్తి తన తండ్రి, సోదరి, పిల్లలతో కలిసి కారులో ప్రయాణించసాగాడు. ఆ సమయంలో అతను అతివేగంగా వాహనం నడుపుతూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. వేగంతో ఉన్న కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం అతని భార్య, కుమారుడు, తల్లిదండ్రులు కలసి మొత్తం రూ. 80 లక్షల బీమా పరిహారం కోసం డిమాండ్ చేశారు.

వివరాలు 

టైరు పేలడం వల్లే ప్రమాదం

కానీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటులో రవీష్ అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం టైరు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వాదిస్తూ, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అయితే, బీమా పరిహారం పొందాలంటే మృతుడు అతివేగంగా లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపలేదని రుజువు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. అదేగాక, మృతుడు బీమా పాలసీ కవర్ పరిధిలోకి వస్తాడని నిరూపించాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంటుందని వెల్లడించింది.

వివరాలు 

బీమా కంపెనీపై పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదు 

ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం, మృతుడు తన తప్పిదం వల్లే ప్రమాదానికి గురై మృతిచెందాడని స్పష్టంగా వెల్లడించారు. అతను స్వయంగా హాని కలిగించుకునే స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతని చట్టబద్ధమైన వారసులు బీమా పరిహారం క్లెయిమ్ చేయలేరని తేల్చిచెప్పారు. ఎటువంటి బాహ్య కారణం లేకుండా కేవలం వాహనదారుడి తప్పిదం వల్లే ప్రమాదం జరిగితే, బీమా కంపెనీపై పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదని తుదిగా తీర్పునిచ్చారు.