Page Loader
Weather Update: మరో వారం చలి ప్రభావం..ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
మరో వారం చలి ప్రభావం..ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ

Weather Update: మరో వారం చలి ప్రభావం..ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉదయం వేళ మంచు కురుస్తుండగా, మధ్యాహ్నం ఎండలు, చలిగాలులు కలిసి వాతావరణాన్ని మరింత చల్లగా మారుస్తున్నాయి. హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, ఈ చలికాల పరిస్థితి మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, నిర్మల్‌, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Details

అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌ జిల్లా బేలాలో 8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.9 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా పెంబీలో 9.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొహినాబాద్‌లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కారణంగా ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.