అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు
విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు. ఈ నేపథ్యంలోనే పోర్టు కార్మిక సంఘాలకు,యాజమాన్యానికి మధ్య గురువారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి. 9 డిమాండ్లలో కేవలం మూడింటిపైనే యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ వెల్లడించింది. మిగతా 6 డిమాండ్లపైనా అనుకూలంగా వ్యవహరించాలని సంఘం పట్టుబడుతోంది. ఇందుకోసం యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపింది. మరోవైపు పోర్టు నిర్మాణానికి స్థానిక ప్రజలు తమ భూములను దారాదత్తం చేశారని గుర్తు చేసింది. పోర్టుకు భూములు ఇచ్చిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాని డిమాండ్ చేస్తోంది. పోర్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని యూనియన్ కోరుతోంది.ఈ మేరకు రూ.36,500 చెల్లించాలని పట్టుబట్టింది.
వీఆర్ఎస్ తీసుకుంటే రూ.50 లక్షలు చెల్లించాలి: యూనియన్
మరోవైపు విధుల నుంచి తొలగించిన కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాల కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఎస్ తీసుకుంటే ఒక్కో కార్మికుడికి రూ. 50 లక్షలు చెల్లించాలన్నారు. గత 45 రోజులుగా కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బారికేడ్లను తొలగించుకుంటూ కార్మికులు పోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ మేరకు కార్మిక సంఘాలను,భూ నిర్వాసితులను పోలీసులు అడ్డుకోగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోర్టు గేట్ వద్దే బైఠాయించిన కార్మికులతో ఆర్డీఓ చర్చించారు. మొత్తం 9 డిమాండ్లను యూనియన్ నేతలు ప్రభుత్వం ముందుకు తెచ్చారు. త్వరలోనే తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.