
AP Cabinet Decisions: సీఆర్డీయే నిర్ణయాలకు అనుమతి.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు బలమైన పునాదులు వేసే దిశగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (SIPB)తీసుకొచ్చిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి అనుకూలంగా రూపొందించిన కొత్త విధానానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి ఆమోదించింది. ఇతర అంశాల్లో భాగంగా, సాగు భూములను వ్యవసాయేతరంగా మారుస్తూ తీసుకురావాలనుకున్న చట్టంపై కూడా చర్చ జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశం సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ వ్యవధిలో 50కి పైగా అంశాలపై చర్చించి, అనేక నిర్ణయాలను తీసుకున్నారు.
వివరాలు
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా పెట్టుబడులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గాన్ని ఆదేశించారు. ఇటీవల తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడిందని సీఎం పేర్కొన్నారు. ఇంకా, నాలాల నిర్వహణకు సంబంధించిన ఫీజుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. నాలాలకు సంబంధించి రెవెన్యూ శాఖ, పంచాయతీ శాఖల సంబంధం ఉన్న కారణంగా, తదుపరి కేబినెట్ సమావేశంలో మరింత విశ్లేషణతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
అక్రమంగా అభివృద్ధి చేసిన లేఔట్లను క్రమబద్ధీకరించే అంశంపై కూడా చర్చ
అలాగే విశాఖపట్టణం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కూడా మంత్రివర్గం అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. మరోవైపు, అక్రమంగా అభివృద్ధి చేసిన లేఔట్లను క్రమబద్ధీకరించే అంశంపై కూడా చర్చ సాగింది. మళ్ళీ,మళ్ళీ చట్టాలను అతిక్రమించిన వారిని ఆదుకోవడం సరికాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ సమస్యపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సింగపూర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన పరిశీలనలు, చర్చలు,అనుభవాలను మంత్రివర్గ సభ్యులకు వివరించారు. ఆ పర్యటనలో రాష్ట్రానికి లాభాలు చేకూరే విధంగా చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు.