
AP Cabinet: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండా సమావేశం..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల దృష్ట్యా, సభ ముందుకు ప్రవేశపెట్టబోయే బిల్లులకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. మొత్తం 15 అంశాలు ఈరోజు సమావేశం ఎజెండాలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా, ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ప్రాంతం మినహా అనధికారికంగా నిర్మించిన భవనాలకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది. అలాగే, నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చట్టాల్లో సవరణలు చేయాలని కేబినెట్ నిర్ణయించవచ్చని అంచనా.
వివరాలు
లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలకు భూముల కేటాయింపు అంశం
వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు చేసి 'తాడిగడప మున్సిపాలిటీ'గా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతి పరిధిలోని ముఖ్యమైన ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకునే అవకాశముంది. అంతేకాకుండా, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955,ఏపీ మున్సిపాలిటీస్ చట్టం 1965లకు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీ కోసం మరో మూడు కొత్త తేదీలను ఖరారు చేయనున్నారు. అమరావతి పరిధిలో గతంలో 343ఎకరాలకు సంబంధించి జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలకు భూముల కేటాయింపు అంశంపై కూడా చర్చించి అనుమతి ఇవ్వనున్నారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలు
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కొన్ని భూములను వ్యవసాయ నుంచి వ్యవసాయేతరంగా మార్చే ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ సమ్మతి తెలపనుంది. దసరా పండుగ నాటికి వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటోలను సొంతంగా నడిపే వారికి రూ.15 వేల సహాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే పలు కీలక బిల్లులపై చర్చించి, వాటికి అనుమతి ఇవ్వడం కూడా ఈరోజు కేబినెట్ ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.