Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బుడమేరులో మూడు చోట్ల పునరావాస గండ్లు ఏర్పడి, వరద నీరు విజయవాడ నగరంలోని ఇళ్లను ముంచెత్తింది. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు తక్షణ సహాయం అందేలా చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, వారికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.
సీఎం ట్వీట్ ఇదే..
"భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారికి విశేషమైన ప్యాకేజీని ప్రకటించాం.విజయవాడ నగరంలో వరదలో చిక్కుకున్న ప్రతి ఇంటికి రూ.25 వేలు,పై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరదల వల్ల ఇల్లు నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు సాయం చేస్తాం" అని పేర్కొన్నారు. అదనంగా,కిరాణా దుకాణాలు,చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ.25 వేలు,ఎంఎస్ఎంఈలు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.35 వేలు సాయం
అలాగే,ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు,ఆటోల కోసం రూ.10 వేలు పరిహారం అందిస్తామని చెప్పారు. వ్యవసాయ పంటల నష్టానికి హెక్టారుకు రూ.25 వేలు,ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.35 వేలు సాయం అందజేస్తామని సీఎం తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వమంతా బాధితులకు అండగా నిలుస్తుందని, బ్యాంకులు, బీమా సంస్థల సహకారంతో మరింత సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాము. వరదల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా అన్ని విషయాలు పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నాము అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.