AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకం.. అమృతధార పేరుతో జలజీవన్ మిషన్ అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళాయి ఏర్పాటు చేయడమే జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2019 ఆగష్టులో ప్రారంభమైన ఈ పథకం మొదట బోర్‌వెల్స్ ద్వారా నీరు సరఫరాకు మాత్రమే పరిమితమైందని ఆయన తెలిపారు. బుధవారం లెమన్ ట్రీ హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పథకానికి సంబంధించిన అనేక లోపాలు
ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీరు అందించే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను నెరవేర్చడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొంటున్నామని, రాష్ట్రంలో ఈ పథకాన్ని "అమృత ధార" పేరుతో అమలు చేయనున్నట్లు వివరించారు. జల్ జీవన్ మిషన్‌లో ఉన్న లోపాలు, ఇబ్బందులను సరిదిద్దుకుని ప్రజలకు త్రాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి,కార్యక్రమం అమలులో వచ్చిన సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేసిన రివ్యూలో పథకానికి సంబంధించిన అనేక లోపాలు వెల్లడయ్యాయని చెప్పారు.
రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా
పథకానికి అవసరమైన నిధులను కోరడంలో గత ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని, కేరళ వంటి చిన్న రాష్ట్రం రూ. 46,000 కోట్లు కోరగా, ఏపీ కేవలం రూ. 26,000 కోట్లు మాత్రమే కోరిందని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు కూడా అందించకపోవడంతో ఈ పథకం అమలు కాలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం పెద్దలతో చర్చించి, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చెప్పి, రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కృషి చేశామని వెల్లడించారు. నాలుగు వేల కోట్ల నిధులను సద్వినియోగం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర నిబంధనల ప్రకారం రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా, దానికి నిర్లక్ష్యం చూపించిందని చెప్పారు.
55.30 లక్షల గృహాలకు మాత్రమే నీటి కుళాయిలు
ప్రస్తుత ప్రభుత్వం నీటి సరఫరా మెరుగుపరచేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నీటి సమస్యలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. రూ. 70,000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని కేంద్రానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 70.40 లక్షల గృహాలకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రకటించినా, పుల్స్ సర్వే ప్రకారం 55.30 లక్షల గృహాలకు మాత్రమే నీటి కుళాయిలు ఉన్నట్లు తేలిందని అన్నారు. పైపులైన్ డిజైన్‌లో గందరగోళం ఉందని, వాటిని సరిచేస్తామని, ఇంజనీరింగ్ అధికారులు నీటి ధార సరిగ్గా వచ్చేలా చూడాలని ఆదేశించారు.
ప్రాజెక్టు పొడిగించేందుకు నిధులు
ప్రాజెక్టు జనవరి 2025 నాటికి పూర్తవుతుందని, అవసరమైతే దీన్ని పొడిగించేందుకు నిధులు అందించాలని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పాడైపోయిన పైపులైన్‌లను కూడా పునరుద్ధరించలేదని, అమృత ధార పథకంతో ఈ లోపాలను సరిచేసి ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు తమ ప్రాంతాల పరిస్థితులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.