CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజన్ 2047 గురించి కూడా చర్చిస్తూ, ఈ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమన్నారు.
ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి
ఇక వైఎస్ జగన్ కు అదానీ రూ. 1750 కోట్లు లంచం ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విషయంపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్రం నుంచి వచ్చే పెట్టుబడుల గురించి, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ప్రాజెక్టులపై కూడా చర్చలు జరిగాయి. కేంద్రంతో అనుసంధానం చేసి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు సూచన ఇచ్చారు.