
AP Anganwadi: అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే మెనూలో మార్పులు.. జిల్లాకో కేంద్రంలో పైలట్ ప్రాజెక్టు
ఈ వార్తాకథనం ఏంటి
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత రుచికరంగా, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
3 నుంచి 6 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు మధ్యాహ్న భోజనం మెనూలో కొత్త మార్పులు చేయనుంది.
ప్రతి వారం రెండు రోజుల పాటు మధ్యాహ్న భోజనంగా ఎగ్ ఫ్రైడ్‌రైస్‌ను అందించనున్నది.
అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలను అందించనుంది.
ఇకపై అన్ని రకాల కూరగాయలు, పప్పుల్లో మునగ పొడిని తప్పనిసరిగా వాడనున్నారు.
బాలామృతంలో చక్కెర పరిమాణాన్ని తగ్గించి, మరిన్ని పోషకాలతో పాటు మార్పులు చేశారు.
వివరాలు
పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
ఈ మార్పులను తొలుత పైలట్ ప్రాజెక్టు రూపంలో విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో నెలరోజుల పాటు అమలు చేశారు.
ఈ కాలంలో అక్కడి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు. ఈ అభిప్రాయాల ఆధారంగా కొన్ని సవరణలు చేసి, వచ్చే పదిరోజుల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో మరోసారి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
నెలరోజుల తరువాత తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించి, ఆయా సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.
వివరాలు
చక్కెర లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు
బాలామృతంలోని పోషకాల పెంపు కోసం అవసరమైన మార్పులపై యునిసెఫ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, టాటా ట్రస్ట్, మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధులతో కూడిన కమిటీతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు దఫాలు సమావేశమయ్యారు.
వారి సలహాలు, సూచనల మేరకు బాలామృతంలో చక్కెరను తగ్గించి, పోషకాహార విలువలు పెంచేందుకు పెసరపప్పు, గోధుమ పిండి, వేయించిన వేరుశనగ పొడి, శనగ పొడిని కలిపి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అయితే, చక్కెర లేకపోవడంపై తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది తల్లిదండ్రులు స్వల్ప పరిమాణంలో అయినా చక్కెర లేదా బెల్లం కలపాలని సూచించారు.
వివరాలు
వయస్సు ఆధారంగా బాలామృతంలో విభజన
శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టులోని తల్లిదండ్రులు, వేరుశనగ పొడి వాడటం వల్ల వాసన రావడం గమనించారని, అందుకు జీలకర్ర కలిపితే అదంతా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్తూరు గ్రామీణ ఐసీడీఎస్ పరిధిలోని తల్లిదండ్రులు, చక్కెర కలపవద్దని సూచించారు.
ఇప్పటివరకు 6 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సున్న పిల్లలకు నెలకు సగటున రెండున్నర కిలోల బాలామృతాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు.
ఇకపై ఈ వయస్సు సమూహాన్నిరెండు విభాగాలుగా విభజించనున్నారు.7 నుంచి 12 నెలల వయస్సు పిల్లలను 'జూనియర్' విభాగంగా,13 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు పిల్లలను 'సీనియర్' విభాగంగా పరిగణించి,వారి వయస్సు ఆధారంగా పోషక విలువలు కలిగిన బాలామృతాన్ని తయారు చేయనున్నారు. ఈ కొత్త బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు.