LOADING...
Andhra News: డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్‌
డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్‌

Andhra News: డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్ వ్యవసాయానికి డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం "నమో డ్రోన్‌ దీదీ" పేరుతో ప్రారంభించిన పథకంలో భాగంగా, మహిళల సంఘాలకు డ్రోన్లు అందించేందుకు కేంద్రం,రాష్ట్రం కలిసి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా, డ్రోన్ల ఖరీదుపై 80 శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా, ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సరంలో మొత్తం 440మంది మహిళలకు డ్రోన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో డ్రోన్‌ ధర దాదాపు రూ.10లక్షలు కాగా, ఇందులో రూ.8లక్షలు రాయితీగా మంజూరవుతుంది. మిగిలిన రూ.2 లక్షలు మాత్రం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లేదా వీవోల ద్వారా రుణంగా మంజూరు చేయనుంది. ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్రంలో 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు గుర్తించారు.

వివరాలు 

బ్యాటరీ ఆధారిత డ్రోన్లు - సులభమైన వినియోగం 

మిగతా ఎంపికలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం వివిధ కంపెనీల ద్వారా నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు "DH-AG-E10" మోడల్ డ్రోన్లను ఎంపిక చేసింది. ఇవి 15 కిలోల కన్నా తక్కువ బరువు కలిగి ఉండటంతో సులభంగా తరలించవచ్చు. ఈ డ్రోన్లు పూర్తిగా బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. డ్రోన్లను ఎలా వినియోగించాలో ప్రభుత్వమే శిక్షణను ఇస్తోంది.

వివరాలు 

ఆరోగ్య పరిరక్షణతోపాటు ఆదాయ వృద్ధి 

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు ఆర్థికంగా లాభం కలిగే అవకాశమే కాదు, ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా రైతులు చేతితో రసాయనాలను పిచికారి చేసే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా, డ్రోన్లు అవసరమైన చోటే మందుల్ని పిచికారి చేయగలుగుతాయి. ఇది మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మాన్యువల్ పద్ధతిలో పిచికారి చేస్తే మందుల వాడకం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది.

వివరాలు 

రసాయనాల వినియోగంలో 10 శాతం తగ్గుదల 

డ్రోన్ల వినియోగం ద్వారా సుమారుగా 10 శాతం వరకు రసాయనాల వాడకాన్ని తగ్గించవచ్చు. ఒక్కో డ్రోన్‌ రోజుకు 8 గంటల పాటు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతి ఎకరంలో పిచికారి చేసేందుకు కేవలం 5-7 నిమిషాల సమయం మాత్రమే అవసరం అవుతుంది. ఇది రైతుల సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఇంకా, డ్రోన్లను ఇతరులకు అద్దెకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా అద్దె ద్వారా అదనపు ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు డ్రోన్‌ సేవల కోసం ఎకరానికి రూ.500 చొప్పున అద్దె వసూలు చేస్తున్నాయి.