Page Loader
AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'
అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'

AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్​లో ఎస్సై నియామకాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను ప్రభుత్వం సవాలు చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్సై అభ్యర్థులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ మేరకు మొత్తం 45 వేల మంది యువత భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని స్టే ఎత్తివేయాలన్నారు. ఈ క్రమంలోనే ఎత్తు కొలతల ప్రక్రియకు సంబంధించిన వీడియోగ్రఫీని కోర్టుకు సమర్పించారు. అయితే ప్రభుత్వ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు నియమించే బృందం సమక్షంలో అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలుస్తామని వెల్లడించింది. ఒకవేళ అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేశారని నిర్థారణ అయితే ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

DETAILS

మాన్యువల్‌ విధానంలో ఎత్తును కొలవాలన్న కోర్టు

ఈనెల 29న ఎంతమంది హాజరవుతారో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్​ను ఆదేశించింగది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఎస్సై నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు గతంలోనే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బాధితుల తరఫున జడ శ్రావణ్‌ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.ఎత్తు అంశంలో అన్యాయం జరిగిందని, గతంలో అర్హులైనవారిని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎస్సై అభ్యర్థుల ఎత్తును డిజిటల్‌ మెషిన్‌ ద్వారా లెక్కించడంపై కోర్టు ఆక్షేపించింది. ఎత్తును కొలిచేందుకు డిజిటల్‌ సామాగ్రిని వినియోగిస్తామని నోటిఫికేషన్లో ఎందుకు పేర్కొనలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. మాన్యువల్‌ విధానంలో ఎత్తును కొలవాలని, అర్హులను రాత పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది.