
Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జరిపిన విచారణలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నెలల ముందే జ్యోతి అక్కడికి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. గత ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై తీవ్ర ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ముందే, అంటే దాదాపు మూడు నెలల కిందట, జ్యోతి పహల్గాంలో పర్యటించి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం.
వివరాలు
పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ తో జ్యోతికి సంబంధం
ఆ వీడియోలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఆమె పాక్ గూఢచార సంస్థలకు అందించవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ దిశగా మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గత వారం,దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి గూఢచర్యం కేసులో హరియాణా పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆమె గతంలో పాకిస్తాన్‌కు పలు మార్లు ప్రయాణించినట్లు, ఒకసారి చైనా దేశానికి కూడా వెళ్లినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' అనంతరం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ఆమె న్యూఢిల్లీ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ అనే అధికారితో నేరుగా సంబంధాల్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దానితో పాటు, జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు.
వివరాలు
2023లో పాకిస్తాన్‌కు..
జ్యోతి మల్హోత్రా ఓ ట్రావెల్ బ్లాగర్,యూట్యూబర్. ఆమె "ట్రావెల్ విత్ జో" అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. 2023లో పాకిస్తాన్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు డానిష్ పరిచయమయ్యాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా డానిష్‌తో ఆమె సంబంధాలను కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ అహ్సాన్ అనే మరో వ్యక్తిని ఆమె కలిశారు. ఆ వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన నిఘా,రక్షణ శాఖలకు చెందిన అధికారులను ఆమెకు పరిచయం చేశాడు. జ్యోతి మల్హోత్రా,దేశ రక్షణకు సంబంధించిన చాలా సున్నితమైన,కీలక సమాచారాన్ని పాకిస్థాన్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.