
Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు
ఈ వార్తాకథనం ఏంటి
లక్షలాది మంది ఫాలోవర్లున్న కొందరు యూట్యూబర్ల వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపించిన విషయం వెలుగులోకి రావడంతో సంచలనం సృష్టించింది. ఇటీవల జ్యోతితో సంబంధాలున్నపూరీకి చెందిన మరొక యూట్యూబర్ ప్రియాంక సేనాపతి వ్యవహారంపై ఒడిశా పోలీసులు విచారణ ప్రారంభించారు. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో జ్యోతి మల్హోత్రా తోపాటు,ఆమెకు సహకరించిన మరొరుగురిని హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా,ఆమెకు పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహితసంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
వివరాలు
జ్యోతి నిజంగా జగన్నాథస్వామి దర్శనానికి వచ్చిందా?
ఈ సమాచారం తెలుసుకున్న పూరీ పోలీసులకు హరియాణా అధికారులు సమాచారం అందించడంతో, ఎస్పీ వినీత్ అగర్వాల్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. 2024 సెప్టెంబర్ 26న జ్యోతి పూరీకి వచ్చి శ్రీక్షేత్ర జగన్నాథ ఆలయాన్ని సందర్శించినట్లు సమాచారం. ఆమె అక్కడి ఓ హోటల్లో బస చేసి, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. ఈ ప్రయాణంలో ప్రియాంక కూడా జ్యోతితో కలిసి తిరిగినట్లు తెలిసింది. అయితే ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కన్ను ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో జ్యోతి నిజంగా జగన్నాథస్వామి దర్శనానికి వచ్చిందా? లేదా రెక్కీ చేసి పాక్‌కు సమాచారం పంపిందా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో స్పందించిన ప్రియాంక
మరోవైపు ప్రియాంక కూడా మూడు నెలల క్రితం పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించినట్లు తెలిసింది. ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఎవరు ఎవరిని కలిశారు? అక్కడ ఏమి చేశారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం కీలకంగా మారాయి. దీనిపై స్పందించిన ప్రియాంక ఆదివారం సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ''జ్యోతి మల్హోత్రా పాక్ గూఢచారిణి అనే విషయం నాకు తెలియదు. పూరీకి వచ్చిన ఆమెను స్నేహితురాలిగా భావించి, కలిసి తిరిగాను. నేను పాకిస్తాన్‌కు కేవలం విహారయాత్ర కోసం వెళ్లా. అంతకన్నా ఎక్కువ ఏమీ జరగలేదు. పోలీసుల దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను'' అని తెలిపారు.
వివరాలు
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఇక ప్రియాంక తండ్రి రాజ్‌కిశోర్ సేనాపతి కూడా ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. హరియాణా పోలీసులతో కలసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నదని పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్ తెలిపారు. ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమన్నారు. దర్యాప్తు ముగిసే వరకు ప్రియాంక పూరీని వెళ్లరాదన్న పోలీసులు ఆమెకు తెలిపారు. ప్రియాంకతో సంబంధం ఉన్న యూట్యూబ్ వీడియోలన్నింటినీ సైబర్ నిపుణులతో పరిశీలిస్తున్నట్లు సమాచారం.