
కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
అస్సాంలోని నాగావ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఒక కంపార్ట్‌మెంట్ ట్రక్కును ఆమె వాహనం ఢీకొనడంతో జున్మోని రభా మృతి చెందినట్లు తెలిపారు.
అయితే జున్మోని రభా కుటుంబ సభ్యులు ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేసును విచారణకు సీఐడీకి బదిలీ చేసినట్లు అస్సాం డీజీపీ జీపీ సింగ్ తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌ఐ రభ యూనిఫాంలో కాకుండా ప్రైవేట్ కారులో ఒంటరిగా ఉన్నారు.
అసోం
భద్రత లేకుండా సివిల్ దుస్తులతో ఒంటరిగా ఎందుకు వెళ్లినట్లు?
ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసు పెట్రోలింగ్ బృందం తెల్లవారుజామున 2:30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రభా కారును ఢీకొట్టిన కంటైనర్ ట్రక్కు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రభా ప్రస్తుతం మోరికోలాంగ్ పోలీసు ఔట్‌పోస్టుకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు.
రభా తన పర్సనల్ వాహనంలో ఎగువ అస్సాం వైపు ఎటువంటి భద్రత లేకుండా సివిల్ దుస్తులతో ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారనే దానిపై క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు.
అసోం
అసలు ఎవరు జున్మోని రాభా?
2022 జనవరిలో బిహ్‌పురియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె టెలిఫోనిక్ సంభాషణ లీక్ అయినప్పుడు 'లేడీ సింగం' జున్మోని రభా వెలుగులోకి వచ్చారు.
పలువురు బోట్‌మెన్‌లను అరెస్టు చేయడంపై వీరిద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు లీకైన ఆడియోలో వినిపించింది.
అవినీతి కేసులో జున్మోని రభా గతంలో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆమె సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆమె తిరిగి ఇటీవల విధుల్లో చేరారు.