
Assam: సిల్చార్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం,వరదలు.. 132 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో వర్షాలు కురవడంతో రాష్ట్రంలో అన్ని వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ భారీ వర్షాల దెబ్బకు ఇళ్లు,రహదారులు నీట మునిగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న సిల్చార్‌లో 24గంటల వ్యవధిలో 415 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. 1893లో నమోదైన 290.3మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మించి,జూన్ 1న నమోదైన వర్షపాతం గత 132 ఏళ్ల రికార్డును చెరిపేసింది. భారీ వర్షాలకి ద్రోణి ప్రభావమే కారణమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ద్రోణి అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించడంతో అక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
వివరాలు
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మొత్తం 34 మంది మృతి
ఈ వర్షాల కారణంగా ఇప్పటివరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో కూడా సిల్చార్ నగరాన్ని బరాక్ నది పొంగి ప్రవహించడం వల్ల వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బేత్కుండి వద్ద నదిపై వాగు తెగిపోవడంతో సిల్చార్ నగరంలోని 90 శాతం ప్రాంతం నీటమునిగిపోయింది. తాజాగా జూన్ 1న కురిసిన వర్షాలతో మరోసారి అదే పరిస్థితి తలెత్తింది.
వివరాలు
మేఘాలయ రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు
ఇక గత మూడు రోజులుగా ఈశాన్య భారతదేశంలోని అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు వరదలతో విలవిలలాడుతున్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడడంతో మరణాలు సంభవించాయి. మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 31న మిజోరాంలో సాధారణం కంటే 1,102 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే, మే 28 నుంచి జూన్ 1 వరకు మేఘాలయ రాష్ట్రంలో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసాయి.