వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు సంబందించిన విచారణ మంగళవారం జరిగింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని, అతడి నుంచి మరింత సమాచారం సేకరించాలని సీబీఐ వాదించింది. గత నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి తెలుసని సీబీఐ చెప్పడం గమనార్హం. హత్యకు ముందు, తర్వాత సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డిలు అవినాష్ ఇంట్లో ఉన్నారని సీబీఐ పేర్కొంది. సునీల్, ఉదయ్, జయప్రకాష్ రెడ్డిలతో అవినాష్‌కు ఉన్న సంబంధాలేమిటో తేలాల్సి ఉందని సీబీఐ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించింది.
హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సి ఉంది: సీబీఐ
హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రోజు ఉదయం తాను జమ్మలమడుగు సమీపంలోనే ఉన్నానని అవినాష్ చెప్పాడని, అయితే ఆ సమయంలో అవినాష్ ఇంట్లోనే ఉన్నట్లు మొబైల్ సిగ్నల్స్ ద్వారా తెలిసిందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్య జరిగిన రోజు పగలు, రాత్రంతా అవినాష్ ఫోన్ అసాధారణంగా వాడినట్లు తేలిందని సీబీఐ చెప్పింది. ఈ కేసులో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఇంప్లీడెడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆమె తరపున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు.