Page Loader
Congress: 'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'.. రాహుల్ గాంధీ కేసుపై కాంగ్రెస్  
'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'.. రాహుల్ గాంధీ కేసుపై కాంగ్రెస్

Congress: 'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'.. రాహుల్ గాంధీ కేసుపై కాంగ్రెస్  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై జరుగుతున్న కుట్రలను, ప్రత్యేకంగా బీజేపీ చేస్తున్న రాజకీయ కక్షలను ప్రస్తావిస్తూ, రాహుల్‌ గాంధీ ఇప్పటికే 26 ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ జాతీయ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వారసత్వాన్ని కాపాడటానికి రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నందుకు అతనిపై నమోదైన కేసులను ''బ్యాడ్జ్‌ ఆఫ్‌ ఆనర్‌''గా భావిస్తున్నామని, ఇదే తమకు గర్వకారణమని వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

వివరాలు 

రాహుల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు 

తమపై ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా ఆరెస్సెస్‌-బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. రాహుల్‌ను,కాంగ్రెస్‌ను బీజేపీ ఎప్పటికీ నిలువరించలేదని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అయితే, తమ ఎంపీలు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేస్తే,పోలీసులు వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. గురువారం, పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన తోపులాటలో, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌ గాయపడటానికి రాహుల్‌ గాంధీ కారణమని బీజేపీ నేతలు ఆరోపించడంతో, రాహుల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. హోం మంత్రి అమిత్‌ షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ ప్రశ్నించడం వల్లే, బీజేపీ నేతలు ఈ కుట్రలు పన్నుతున్నారని కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు.

వివరాలు 

బీజేపీ రాహుల్‌ గాంధీపై అసంబద్ధ ఆరోపణలు: ప్రియాంక 

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను దేశ ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. బీజేపీ రాహుల్‌ గాంధీపై అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టడం వారి అహంకారాన్ని సూచిస్తోందని ప్రియాంక మండిపడ్డారు. శాంతియుత నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తల వద్దకు బీజేపీ నేతలు కర్రలతో వచ్చి అడ్డుకున్నారని ఆమె అన్నారు. గందరగోళం సృష్టించినందుకు బీజేపీ ఎంపీలపై పార్లమెంట్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్ ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెలిపారు.

వివరాలు 

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన 

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసనలు చేస్తున్నాయి. తాజాగా, దిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ధర్నా చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయ్‌ చౌక్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, అంబేడ్కర్‌ను అవమానించినందుకు కాంగ్రెస్‌ పార్టీపై భాజపా ఎంపీలు కూడా నిరసన చేపట్టారు.