
బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు చూసే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఒకటిగా నిలిచింది. సదరు షో సెన్సార్ కటింగ్స్ లేకుండానే ప్రసారం అవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహించింది.
ఈ మేరకు స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ తెలుగు షోను నిషేధించాలని గతంలోనే పిటిషన్లు దాఖలయ్యాయి. విచారించిన హైకోర్టు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయా సంస్థలు, హోస్ట్ నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.
బిగ్‌బాస్ అశ్లీలతను పెంచి పోషిస్తోందంటూ తెలుగు యువశక్తి ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కేతిరెడ్డి వేర్వేరుగా రెండు వ్యాజ్యాలు(PIL) దాఖలు చేశారు.
సెన్సార్ లేకుండా ప్రసారం చేస్తున్నందున రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలల్లోగా ప్రసారం చెయ్యాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
DETAILS
4 వారాల తర్వాత లోతుగా విచారిస్తామని హైకోర్టు స్పష్టం
అనంతరం స్పందించిన ప్రతివాదులు ప్రస్తుతం షో ప్రసారం కావట్లేదని, అభ్యంతరాలుంటే ప్రసారం తర్వాత మరోసారి కోర్టుకు రావాల్సిందిగా ఎండోమోల్ ఇండియా సంస్థ తరఫున న్యాయవాది సూచించారు.
మరోవైపు బిగ్‌బాస్ షో చూడటం ఇష్టం లేకపోతే ఛానల్ మార్చుకోవాలని స్టార్ మా తరపున లాయర్ సీవీ మోహన్‌రెడ్డి హితవు పలికారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ సెన్సార్ అవసరమేనని స్పష్టం చేసింది.
ఒక్కసారి షో టెలికాస్ట్ అయ్యాక చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అశ్లీలం ప్రసారం చేస్తున్నా పర్యవేక్షించకూడదా అని నిలదీసింది.
నైతిక విలువలు కాపాడుకోవాలని ఈ మేరకు తేల్చి చెప్పింది. ఈ అంశంపై లోతుగా విచారిస్తామని చెప్పిన కోర్టు, తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.