కొవిన్ పోర్టల్ డేటా లీకేజీలో కీలక పరిణామం.. బిహారీని అరెస్ట్ చేసిన దిల్లీ ఇంటిలిజెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొవిన్ పోర్టల్ ను తీసుకొచ్చింది. అయితే సదరు పోర్టల్ నుంచి సున్నితమైన సమాచార లీకులు దేశంలో సంచలనం రేపింది.
ప్రతిపక్షాల కౌంటర్లను కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సమర్థంగా తిప్పికొట్టింది. ఓటీపీతో మాత్రమే సదరు డేటాను చూసేందుకు వీలుందని స్పష్టం చేసింది.
వ్యక్తిగత అనుమతి లేకుండా డేటా లీకయ్యే అవకాశమే లేదని తేల్చిచెప్పింది.
ఈ క్రమంలో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగగా, ఈ కేసులో తాజాగా బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అరెస్టయ్యారు. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని దిల్లీ స్పెషల్ పోలీస్ లోని ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది.
ప్రముఖులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను సోషల్ మీడియాలో లీక్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
DETAILS
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ)తో కలిసి వివరాలు సేకరించిన దిల్లీ పోలీసులు
దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడి తల్లి ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. లీకైన వివరాలన్నీ అక్కడివే కావడంతో పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు.
అయితే పోర్టల్ లో వ్యక్తుల పేర్లు, ఆధార్, ఫోన్ నంబర్ సహా ఏ తేదీల్లో వ్యాక్సిన్ తీసుకున్నారు, ఏ కేంద్రంలో తీసుకున్నారు అనే వివరాలను పొందుపరిచారు.
ఇంతటి కీలక సమాచారం టెలిగ్రామ్‌లో రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఓటీపీ లేకుండా పోర్టల్ లోని ఏ సమాచారాన్ని ఎక్కడా చూడలేమని, షేర్ కూడా చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే డేటా లీకేజీపై దర్యాప్తు ప్రారంభించిన దిల్లీ పోలీసులు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సీఈఆర్‌టీ)తో కలిసి వివరాలు సేకరించి సదరు బిహారీని అదుపులోకి తీసుకున్నారు.