Brij Bhushan: వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దు.. బ్రిజ్ భూషణ్‌కి బీజేపీ సలహా
రెజ్లర్లు వినేష్ ఫోగట్,బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్, వీరి చేరికతో తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని ఆశిస్తోంది. ఇదే సమయంలో, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ, తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు కాంగ్రెస్ కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పానని, ఇప్పుడు ఈ చేరిక ద్వారా తనపై జరిగిన కుట్ర బయటపడిందని అన్నారు. అయితే, బ్రిజ్ భూషణ్ పునియా,ఫోగట్‌లపై వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ సలహా ఇచ్చినట్లు సమాచారం. అతనిపై వచ్చిన లైంగిక ఆరోపణల తరువాత, వినేష్, బజరంగ్,సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లు ఢిల్లీలో పెద్ద ఆందోళనలకు కారణమయ్యారు.ఈ ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
జులనా నియోజకవర్గం నుండి వినేష్ ఫోగట్ పోటీ
బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ, వినేష్,బజరంగ్ తమ కృషితో రెజ్లింగ్‌లో పేరుతెచ్చుకున్నారని, కానీ కాంగ్రెస్‌లో చేరిన తరువాత వారి పేర్లు మరుగున పడతాయని అన్నారు. వీరు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని భావిస్తే పొరపాటేనని, హర్యానాలో ఏ నియోజకవర్గంలోనైనా బీజేపీ అభ్యర్థి వారిని ఓడిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ జులనా నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు, అలాగే పునియా "కిసాన్ కాంగ్రెస్" వర్కింగ్ చైర్మన్‌గా నియమితులయ్యారు.