Page Loader
BJP: ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే.. ఆ ముగ్గురిలో ఎవరికి దక్కేనో?
ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే.. ఆ ముగ్గురిలో ఎవరికి దక్కేనో?

BJP: ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే.. ఆ ముగ్గురిలో ఎవరికి దక్కేనో?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్నికైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల్లో సొంత పాలనను కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పుడు తన సంఘటనా నిర్మాణంను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. మళ్ళీ ఢిల్లీ పీఠాన్ని సంపాదించడమే కాక, ప్రస్తుతం విపక్షాల చేతిలో ఉన్న ఐదు నుండి ఆరు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవాలనే వ్యూహంతో పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల విజయాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తించిన కమలం పార్టీ,వారి మద్దతును గట్టిగా నిలుపుకోవాలన్న ఆలోచనతో పలు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠాన్ని ఓ మహిళకు కట్టబెట్టాలన్న ఆలోచనపై బీజేపీ లోనుఆలోచనలు నడుస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆర్‌ఎస్‌ఎస్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

బీజేపీ చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, తమిళనాడు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నది. వీరిలో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే, బీజేపీ చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఘనత పొందనున్నారు. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్మలా సీతారామన్‌కు ఈ పోటీలో ఆధిక్యం ఉందని పార్టీ వర్గాల అభిప్రాయం.

వివరాలు 

నిర్మలా సీతారామన్‌

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రముఖంగా పరిశీలనలో ఉన్న నేతల్లో నిర్మలా సీతారామన్‌ పేరు ముందుంది. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎస్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమైన సమావేశాల్లో ఆమె పేరు ప్రస్తావించబడినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ, రక్షణ శాఖ వంటి కీలక కేంద్ర శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆమెకు పార్టీ కార్యకలాపాల్లో, పాలనా అనుభవంలో విస్తృత పరిజ్ఞానం ఉంది. నాయకత్వ సామర్థ్యం, అధికార వ్యవస్థలతో సమన్వయంతోపాటు, దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె నియామకం ద్వారా ఆ రాష్ట్రంలో బీజేపీ పటిష్ఠంగా నిలవగలదని భావిస్తున్నారు.

వివరాలు 

నిర్మలా సీతారామన్‌

అంతేకాక, వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, నిర్మలమ్మ అయితేనే సరైనవారని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనగా ఉన్నది. ఈ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా నిర్మలమ్మకు సంపూర్ణ మద్దతు తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

వానతి శ్రీనివాసన్ 

తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్‌ కూడా అధ్యక్ష పీఠానికి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో ఒకటి. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, ఆమె కోయంబత్తూర్ సౌత్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా పనిచేస్తున్నారు. 1993లో బీజేపీలో చేరిన వానతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షురాలిగా అనేక పదవులను చేపట్టారు. 2020లో ఆమెను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమించారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. తమిళనాడు నుంచి ఈ స్థాయికి చేరిన మొదటి మహిళ ఆమె కావడం విశేషం.

వివరాలు 

పురందేశ్వరి 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన, ప్రస్తుతం రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్న పురందేశ్వరి కూడా జాతీయ అధ్యక్ష పదవికి పోటీదారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేయడం ద్వారా పార్టీకి కొత్త ఊపు తెచ్చారు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా గతంలో పనిచేశారు. ఇటీవల "ఆపరేషన్ సిందూర్" పేరిట వివిధ దేశాల్లో పర్యటించిన బీజేపీ ప్రతినిధి బృందంలో పురందేశ్వరి భాగంగా ఉన్నారు. అయితే అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు చాలా కీలకం. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె.. కొన్నేండ్ల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో పాతకాలం నుంచి కొనసాగుతున్నవారికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఇది ఆమెకు ఆటంకంగా మారే అవకాశముంది.

వివరాలు 

అధ్యక్షుడి మార్పు తప్పనిసరి 

కాగా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా పదవీకాలం రెండేండ్ల క్రితమే (2023, జనవరి) ముగిసింది.కానీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆయన పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించింది. అయితే ఇప్పటికీ కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. నడ్డా త్వరలో కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్న నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన అవసరం నెలకొంది. దీనికోసం పార్టీలో తీవ్రంగా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి.