LOADING...
BJP: బిహార్‌ ఎన్నికల ప్రకటనకు ముందే.. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక 
BJP: బిహార్‌ ఎన్నికల ప్రకటనకు ముందే.. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక

BJP: బిహార్‌ ఎన్నికల ప్రకటనకు ముందే.. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ సారథిని ఎన్నుకునే ప్రక్రియకు సన్నద్ధమవుతోంది. వివిధ కారణాల వల్ల ఈ ఎన్నిక వాయిదా పడినప్పటికీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే అగ్రనాయకుల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. సెప్టెంబర్‌ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల అనంతరం కొత్త నాయకత్వ ఎంపికపై బీజేపీ వేగం పెంచబోతున్నదని,ఈ బాధ్యతకు సంబంధించి పలువురి పేర్లు ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక,ఈసారి జాతీయ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశముందని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

వివరాలు 

సామాజిక సమీకరణాల కంటే పార్టీని బలపడేలా చేయగల నాయకుడి ఎంపికకే ప్రాధాన్యం

అందులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ పురందేశ్వరి వంటి నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, సామాజిక సమీకరణాల కంటే పార్టీని బలపడేలా చేయగల నాయకుడి ఎంపికకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు భావిస్తున్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి పదవిలో కొనసాగుతున్నారు.

వివరాలు 

కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేపీ నడ్డా

ఆయన రెండోసారి పదవీ కాలం 2024 జూన్‌లో ముగిసినప్పటికీ,ప్రస్తుతం కేంద్ర మంత్రిగా,అలాగే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే,కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే కనీసం 50 శాతం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవ్వాలి. దానికి ముందుగా బూత్‌, మండల, జిల్లా స్థాయి ఎన్నికలు జరగాలి. కానీ, హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం పార్లమెంటు సమావేశాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది.