Siddaramaiah: కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్ : సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నట్లు, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వాలని ఆఫర్ చేసినట్లు ఆయన ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్ ఎమ్యెల్యే కూడ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదని, బీజేపీ ఇప్పుడు తమపై అబద్ధమైన కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం విమర్శించారు. సిద్ధరామయ్య, బుధవారం తన స్వస్థలం మైసూరు నగరాన్ని పర్యటించారు, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం, ప్రజలతో నేరుగా సమావేశమై ప్రసంగించారు.
బీజేపీ నేతలు మత వివక్షత పెంచేలా తప్పుడు ప్రచారాలు: సిద్దరామయ్య
''సిద్ధరామయ్య సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇవ్వాలని వారు ప్రతిపాదించారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో? అది ఏదైనా ముద్రిస్తున్నారా? బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, ఆర్ ఆశోకా, బీవై విజయేంద్ర ఈ డబ్బును చెల్లిస్తున్నారా?" అని సీఎం ప్రశ్నించారు. అలాగే, బీజేపీ నేతలు మత వివక్షత పెంచేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బందీపుర అభయారణ్యంలోని రహదారులపై రాత్రిళ్లు వాహనాలు రాకుండా చేయాలని ప్రతిపాదనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.
జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: సోమన్న
ఈ క్రమంలో ''జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సోమన్న అన్నారు. ఇది కేవలం జోస్యం కాదు, ఇది నిజంగా జరగబోతుంది'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.