Amit Shah: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌కు అమిత్ షా
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ జాతీయ నాయకులు పర్యటిస్తూ తెలంగాణ కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ను నింపుతున్నారు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించి, పార్టీ తరుపున చేపట్టాల్సిన కార్యచరణపై కమలం నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే ఆయన హైదరాబాద్ కు వస్తుండడం గమనార్హం. బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హజరు కానున్నారు.
అమిత్ షా షెడ్యూల్ ఇదే!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా 16వ తేదీ రాత్రి 7.55 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్ లోని సీఆర్ఫీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ కు చేరుకుంటారు. అనంతరం అక్కడే బస చేస్తారు. ఇక 17వ తేదీ రాత్రి 8.35 గంటలకు సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అక్కడ 9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ విమోజన ఉత్సవాల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి దిల్లీకి అమిత్ షా పయనమవుతారు.