BJP and SAD : మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గతంలో బీజేపీతో కలిసి పనిచేసి, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఆ కూటమిలో చేరేందుకు సిద్ధమైంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సీట్ల పంపకాల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుల విషయంలోనూ అకాలీదళ్ మద్దతు బీజేపీకి కీలకంగా మారనుంది.
వివరాలు
బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు
బీజేపీ నాయకత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది.
త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
ముఖ్యంగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలంటే అకాలీదళ్‌తో మళ్లీ చేతులు కలపడం అవసరమని బీజేపీ భావించింది.
ఈ నేపథ్యంలో కొంతకాలంగా కొనసాగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్నివ్వడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు సమాచారం.
వివరాలు
1996లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య రాజకీయ పొత్తు
1996లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య రాజకీయ పొత్తు ప్రారంభమైంది.
అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు తీవ్రం కావడంతో 2020 సెప్టెంబర్‌లో అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది.
దీంతో 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.
ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి.
వివరాలు
రెండు పార్టీలకు పరస్పర ప్రయోజనం
పంజాబ్‌లో గ్రామీణ ప్రాంతాలతో పాటు రైతుల్లో శిరోమణి అకాలీదళ్‌కు ఇప్పటికీ కొంత పట్టుంది.
మరోవైపు పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మద్దతు ఉండటంతో పాటు వ్యాపారులు,యువతలోనూ ఆ పార్టీకి ఆదరణ ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.
ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకులు కలిస్తే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది.
అందుకే ఆప్,కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు పాత మిత్రపక్షంతో మళ్లీ పొత్తు పెట్టుకుంది.
గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,అకాలీదళ్ కలిసి పోటీ చేశాయి.
ఆ ఎన్నికల్లో బీజేపీ 23స్థానాల్లో,అకాలీదళ్ 117స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
అయితే ఆ తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు తెగిపోవడంతో రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి.
వివరాలు
రెండు పార్టీలకు పరస్పర ప్రయోజనం
2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది.
అయినప్పటికీ ఆ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. 2019లో సుమారు 9.6 శాతంగా ఉన్న ఓట్ల వాటా 2024 నాటికి 18.5 శాతానికి చేరింది.
మరోవైపు శిరోమణి అకాలీదళ్ పరిస్థితి మాత్రం బలహీనపడింది.
2019లో సుమారు 27.5 శాతంగా ఉన్న ఆ పార్టీ ఓట్ల శాతం 2024లో 13 శాతానికి పడిపోయింది. బఠిండా లోక్‌సభ స్థానంలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది.
వివరాలు
డీలిమిటేషన్ బిల్లుపైనా అకాలీదళ్ మద్దతు కీలకం
ఎన్నికల పొత్తుతో పాటు పార్లమెంట్‌లోనూ అకాలీదళ్ మద్దతు బీజేపీకి అవసరమవుతోంది.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను ఆమోదింపజేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో అకాలీదళ్ మద్దతు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పంజాబ్‌లో ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం కూడా బీజేపీ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.
వివరాలు
డీలిమిటేషన్ బిల్లుపైనా అకాలీదళ్ మద్దతు కీలకం
ప్రస్తుతం పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌తో పాటు కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో అకాలీదళ్‌తో పొత్తు ద్వారా రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.
గ్రామీణ, పట్టణ ఓటర్ల మద్దతును సమన్వయం చేసుకుంటూ బలమైన పోటీ ఇవ్వాలనేది రెండు పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది.
మరి బీజేపీ, అకాలీదళ్ మళ్లీ కలవడం పంజాబ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఈ కూటమి ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.