PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు చెప్పారు. ''నేను ఇక్కడికి వచ్చిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటనతో ఎవరు బాధపడినా, వారికి కూడా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను'' అని తెలిపారు. మోదీ మాట్లాడుతూ, ''ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు నేను తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా'' అని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.
విగ్రహం కూలడంతో మండిపడిన ప్రతిపక్షాలు
కొద్ది రోజుల క్రితం కుప్పకూలిన ఈ 35 అడుగుల ఎత్తున్న శివాజీ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు అయితే, తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రప్రభుత్వం నాణ్యతపై కన్నెత్తి చూడకుండా ప్రచారంపై మాత్రమే దృష్టి పెట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.