Page Loader
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం
రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 07, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కోర్టు షాకిచ్చింది. ఈ మేరకు జులై 18న కోర్టుకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. భారతదేశంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపుల కేసులో విచారణ చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని దిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ తాఖీదులు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ ఛైర్మన్ గా బ్రిజ్ భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని గతంలోనే పలువురు మహిళా రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.

DETAILS

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కదిలిన దిల్లీ పోలీసులు 

అయితే లైంగిక వేధింపులపై దిల్లీ పోలీసులకు రెజర్లు ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శించారు. మరోవైపు మహిళా రెజర్లు న్యాయం కోరుతూ సుప్రీంకోర్టు తలుపును సైతం తట్టారు.ఈ క్రమంలోనే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గత జూన్‌ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై రెండు కేసులు నమోదయ్యాయి.ఈ మేరకు జూన్‌ 15న ఛార్జిషీట్‌ సైతం సిద్ధం చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరితమైన బెదిరింపులు వంటి తీవ్రమైన అభియోగాలను అందులో పొందుపరిచారు. మరోవైపు రెజర్ల ఆరోపణలను ఆయన గతంలోనే ఖండించారు.