Teegala Krishna Reddy: తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం రోజున హైదరాబాద్‌కు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, అలాగే హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయనను కలుసుకున్నారు. ఈ భేటీ, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును కలవడం, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
చంద్రబాబు హయాంలో హైదరాబాద్ అభివృద్ధి
ఈ సమావేశం అనంతరం, తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం ఎన్టీఆర్, చంద్రబాబుతో ప్రారంభమైందని గుర్తు చేశారు. చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం కావడం తమకు ఆనందాన్ని కలిగించిందని,అలాగే తెలంగాణలో కూడా ఎన్టీఆర్ తరహా పాలన రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, సైబరాబాద్ సిటి ఆయన అధికారంలోనే పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబును కలిశానని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అలాగే,రాష్ట్రంలో ఎన్టీఆర్ తరహా పాలన తీసుకురావడం కోసం కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలో టీడీపీ,ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారని,వారిని ఒకే వేదికపైకి తీసుకువస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో టీడీపీకి మునుపటి వైభవం
ఈ సందర్భంగా, కృష్ణారెడ్డి పక్కన మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం, మల్లారెడ్డిని మీడియా ప్రశ్నించగా, వారి ఇంట్లో జరిగే శుభకార్యానికి చంద్రబాబును ఆహ్వానించేందుకే ఆయనను కలిసినట్లు తెలిపారు. ఈ సమావేశం కేవలం ఆహ్వానం కోసమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు తాజాగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఎన్డీయే కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన తెలంగాణలో టీడీపీకి మునుపటి వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు చంద్రబాబును కలవడం, తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.