
Union Cabinet:1.70కోట్ల రైతులకు లబ్ధిచేకూరనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజన.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో ఇవాళ నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశం కొన్ని క్షణాల క్రితం ముగిసింది. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కీలక మంత్రులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ముందుకు వచ్చి ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి (PM Dhan Dhanya Krishi Yojana Scheme) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.70కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుందని స్పష్టంగా తెలిపారు.
వివరాలు
దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాల అభివృద్ధి
ఈ పథకం ద్వారా దేశంలోని వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, పంచాయతీ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ వ్యవస్థలను బలోపేతం చేయడం, నీటిపారుదల మౌలిక వసతులను మెరుగుపరచడం, రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందుబాటులోకి తేచడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.