LOADING...
Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్‌ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలివే!

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్‌ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ క్రమంలో విశాఖలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ సంస్థకు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99పైసలకు కేటాయించే ప్రతిపాదనపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రూ.1,582.98 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్‌ 8,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుంది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు గెలుచుకున్న సంస్థలకు అనుమతులు ఇవ్వనుంది.

Details

నీటి వనరులకు సంబంధించి 51 పనులకు అనుమతులు మంజూరు

ఇందులో రూ.882.47 కోట్లతో జీఏడీ టవర్‌, రూ.1,487.11 కోట్లతో హెచ్‌ఓడీ కార్యాలయాలు, రూ.1,303.85 కోట్లతో ఇతర పరిపాలన భవనాల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనల సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు మైనేని సాకేత్‌ సాయికి స్పోర్ట్స్‌ కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించిన 51 పనులకు మంత్రివర్గం పరిపాలన అనుమతులను మంజూరు చేయనుంది.